అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ టెన్నిస్ కోర్టులోకి రీఎంట్రీ ఇవ్వనుంది. 23 గ్రాండ్‌స్లామ్ టోర్నీలతో మహిళల సింగిల్స్‌లో మకుటం లేని మహారాణిగా వెలుగొందిన సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమై నాలుగేళ్లు కావొస్తోంది. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల వయసులో సెరెనా ఈ నెలలో జరగనున్న క్వీన్స్ క్లబ్ టోర్నీ ద్వారా టెన్నిస్ రాకెట్ పట్టనుంది.
అయితే సెరెనా ఈ టోర్నీలో సింగిల్స్‌లో కాకుండా డబుల్స్‌లో బరిలోకి దిగుతోంది. 2022 యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మూడో రౌండ్‌లో ఓటమి తర్వాత సెరెనా మళ్లీ టెన్నిస్ ఆడలేదు. తాను టెన్నిస్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయాన్ని అమెరికా నల్లకలువ స్వయంగా పంచుకుంది. ‘ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నా’ అని క్యాప్షన్ జత చేసింది.
దీనితో పాటు సెరెనా తెలుపు రంగు నైక్ టెన్నిస్ డ్రెస్‌తో పాటు మొబైల్ ఫోన్‌ను ఫొటోలో పంచుకుంది. అయితే ఫ్రొఫెషనల్ టెన్నిస్‌లోకి మాత్రం రావడం లేదని, కేవలం వైల్డ్‌కార్డ్‌గా క్వీన్స్‌క్లబ్ టోర్నీలో కెనడాకు చెందిన విక్టోరియా బోకోతో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడబోతున్నా అంటూ అసలు విషయాన్ని మెళ్లిగా చెప్పింది.
దీంతో ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి సెరెనా రీఎంట్రీ ఇస్తుందంటూ తెగ సంబరపడిపోయిన అభిమానుల ఆశలు ఆవిరైపోయాయి. 2022లో యూఎస్ ఓపెన్ లో ఓటమి అనంతరం ఆటకు దూరంగా ఉన్న సెరెనా విలియమ్స్ ‘రిటైర్మెంట్’ అనే పదం వాడలేనని, దానికి బదులుగా టెన్నిస్ నుంచి ‘అదృశ్యం’ అవుతున్నానంటూ పరోక్షంగా వీడ్కోలు పలికింది.
ఓపెన్ శకంలో మహిళల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో క్రీడాకారిణిగా సెరెనా విలియమ్స్ (23 టైటిల్స్) నిలిచింది. ఇక తొలి స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం మార్గరెట్ కోర్ట్ (24 గ్రాండ్‌స్లామ్) టైటిల్స్‌తో కొనసాగుతుంది. సెరెనా సాధించిన 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో ఏడు ఆస్ట్రేలియన్ ఓపెన్, మూడు ఫ్రెంచ్ ఓపెన్, ఏడు వింబుల్డన్, ఆరు యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి.


