Shahbaz Ahmed Received Ultimatum From His Father Over Cricketing Career - Sakshi
Sakshi News home page

Shahbaz Ahmed: 'ఏదైనా సాధిస్తేనే ఇంటికి రా..'

Published Tue, Oct 11 2022 8:24 AM | Last Updated on Tue, Oct 11 2022 10:05 AM

Shahbaz Ahmed Received Ultimatum From His Father Over Cricketing Career - Sakshi

మనిషిగా పుట్టిన మనం ఏదైనా సాధిస్తేనే ఆ జన్మకు ఒక పరిపూర్ణత వస్తుందంటారు పెద్దలు. తాము ఏదో సాధించాలని అందరూ ఆ లక్ష్యం దిశగానే అడుగులు వేస్తారు.. కానీ కొందరే సక్సెస్‌ అవుతారు. ఆ కోవకు చెందినవాడే టీమిండియా క్రికెటర్‌ షాబాజ్‌ అహ్మద్‌. మనం ఎందరో క్రికెటర్లనూ చూశాం. సచిన్ నుంచి కోహ్లి వరకు, యువరాజ్‌ నుంచి ధోని వరకు.. ఇలా చెప్పుకుంటే పోతే చాలా మంది ఉన్నారు. కానీ ఎవరి నేపథ్యం వారిది.

అయితే షాబాజ్‌ అహ్మద్‌ కథ వేరుగా ఉంటుంది. క్రికెట్‌పై ప్రేమతో ఇంజనీరింగ్‌ను మధ్యలోనే వదిలేసిన షాబాజ్‌ అహ్మద్‌ తండ్రి కోపానికి బలయ్యాడు. ''ఏదైనా సాధించిన తర్వాతే ఇంటికి తిరిగిరా.. ఏం చేయకపోతే నువ్వేమైపోయావన్న సంగతి కూడా మాకు తెలియకూడదు'' అంటూ హుకుం జారీ చేశాడు.
-సాక్షి, వెబ్‌డెస్క్‌
 

తండ్రి మాటలను సీరియస్‌గా తీసుకున్న షాబాజ్‌ అహ్మద్‌ ఇవాళ క్రికెటర్‌గా ఎదిగిన వైనం అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా దక్షిణాఫ్రికాతో  వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో షాబాజ్‌ అహ్మద్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆడుతున్న తొలి వన్డేలోనే ఈ ఆల్‌రౌండర్‌ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. తన 10 ఓవర్ల కోటాలో షాబాజ్‌ అహ్మద్‌ 54 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీసుకున్నాడు.

అయితే షాబాజ్‌ అహ్మద్‌ అంత ఈజీగా క్రికెటర్‌ కాలేదు. అందుకోసం ఎంతో కష్టపడ్డాడు. జీవితంలో ఎన్నో ఓడిదుడుకులు ఎదుర్కొన్నాడు. షాబాజ్‌ అహ్మద్‌ మొదట చదువు కొనసాగిస్తూనే క్రికెట్‌పై దృష్టి సారించేవాడు. అయితే రెండింటిపై పూర్తిస్థాయిలో దృష్టిని కేంద్రీకరించలేకపోయాడు. దీంతో ఇంజనీరింగ్‌ను మధ్యలోనే వదిలేశాడు. ఆపై హరియాణా నుంచి కోల్‌కతాకు మకాం మార్చాడు. అలా రంజీ క్రికెటర్‌గా కెరీర్‌ను ఆరంభించిన షాబాజ్‌ అహ్మద్‌ ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చాడు. తాజాగా టీమిండియాకు ఆడే స్థాయికి ఎదిగాడు.

ఇక షాబాజ్‌ టీమిండియాకు ఆడడంపై తండ్రి అహ్మద్‌ జాన్‌, తల్లి అబ్నమ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అహ్మద్‌ జాన్‌ మాట్లాడుతూ..''షాబాజ్‌ అహ్మద్‌ చదువును మధ్యలోనే వదిలేసి కోల్‌కతాకు వెళ్లడం నాకు ఇష్టం లేదు. అందుకే ఏదైనా సాధించు.. అప్పటివరకు ఇంటిముఖం చూడకు'' అంటూ హెచ్చరించాను. ఇవాళ వాడు అనుకున్నది సాధించాడు. నేను స్ట్రిక్ట్‌గా ఉండకపోయుంటే ఈరోజు మా ఇంట్లో ఒక క్రికెటర్‌ను చూసేవాడిని కాను అని పేర్కొన్నాడు. 

షాబాజ్‌ అహ్మద్‌ చదువును మధ్యలో వదిలేసినప్పుడు అప్పటి ప్రొఫెసర్‌ఘీ విధంగా స్పందించాడు. అతను మంచి విద్యార్థే కానీ తప్పు నిర్ణయం తీసుకున్నాడు అని పేర్కొన్నారు. దీనిపై షాబాజ్‌ స్పందిస్తూ.. ఏదో ఒకరోజు నాకు డిగ్రీ పట్టాను ఇచ్చి సత్కరిస్తారు అని ధీమా వ్యక్తం చేశాడు. ''నా కొడుకు ఆరోజు అన్న మాటలు నిజమయ్యాయి.. ఇవాళ వాడికి డిగ్రీ ఇచ్చి ఘనంగా సత్కరించారు'' అంటూ తల్లి అబ్నమ్‌ సంతోషంతో పేర్కొంది.

చదవండి: క్రికెట్‌లో అరుదైన ఘటన.. నోరెళ్లబెట్టడం ఖాయం!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement