2009లో పాకిస్తాన్‌లో పర్యటనకు వచ్చిన లంక ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆరోజు బస్సుపై కురిసిన బులెట్ల వర్షానికి లంక జట్టులో పలువురు ఆటగాళ్లు గాయపడ్డారు. వీరిలో థిల్లాన్ సమరవీర, తిలకరత్నే దిల్షాన్, అజంతా మెండిస్, కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే, సురంగ లక్మల్, చమిందా వాస్ సహా మరికొంత మంది క్రికెటర్లు ఉన్నారు.
ఈ దాడిలో ఆరుగురు పోలీసులు చనిపోగా.. ఇద్దరు పౌరులు బలయ్యారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడేందుకు మిగతా దేశాలు నిరాకరించాయి. అప్పటినుంచి దాదాపు 2019 వరకు అంటే పదేళ్ల పాటు ఏ జట్టు కూడా పాకిస్తాన్‌లో పర్యటించడానికి ఇష్టపడలేదు. పాక్ ఏదైనా హోం సిరీస్ ఆడాలంటే యూఏఈకి రావాల్సిందే. దీంతో పాకిస్తాన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు జరగక అక్కడి మైదానాలన్ని వెలవెలబోయాయి. బోర్డు నుంచి సహాయం లేకపోవడంతో క్రికెట్ మైదానాలను మూసే పరిస్థితి కూడా వచ్చింది.
తాజా పరిస్థితి చూస్తే పాకిస్తాన్‌లో కాస్త మార్పు కనిపిస్తుంది. 2019లో శ్రీలంక రెండు టెస్టులు ఆడేందుకు పదేళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టింది. ఫలితం సంగతి పక్కనబెడితే.. పాక్‌లో ఆడేందుకు జంకిన ఇతర దేశాలు లంకతో సిరీస్‌ను పాక్ నిర్వహించిన తీరుపై నమ్మకం వచ్చి క్రికెట్ ఆడేందుకు ఒప్పుకున్నాయి. ఇటీవలే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు కూడా పాక్ గడ్డపై పర్యటించాయి. దశాబ్దం నుంచి క్రికెట్ మ్యాచ్‌లు లేక మూగబోయిన మైదానాలు మళ్లీ కళకళలాడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఈ అంశంపై స్పందించాడు. ''2009లో లంక క్రికెటర్లపై దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్‌లో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. మా దేశంలోని మైదానాలన్నీ వెడ్డింగ్ హాల్స్‌గా మారిపోయాయి. మా మైదానాల్లో క్రికెట్ ఆడాలని మాకున్నప్పటికి పరిస్థితులు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. మైదానాల్లో ప్రేక్షకులు మిస్సయ్యాం. అప్పటి బాధ వర్ణణాతీతం. ఈ పదేళ్లలో దేశంలో ఎంతో మార్పు వచ్చింది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు దేశ ప్రభుత్వం క్రికెట్‌ను బతికించేందుకు చొరవ తీసుకుంది. మేము కూడా విదేశీ లీగ్‌ల్లో ఆడే సమయంలో విదేశీ ఆటగాళ్లతో మాట్లాడేవాళ్లం. వాళ్లను క్రికెట్ ఆడేందుకు ఒప్పించే ప్రయత్నం చేశాం. పాక్‌లో మళ్లీ క్రికెట్ ఆడేందుకు పదేళ్లు పట్టింది. ఈ పదేళ్లలో పాకిస్తాన్ నుంచి మిగతా దేశాలకు క్రికెట్ సురక్షితంగా ఆడుకోవచ్చు అనే భరోసా కల్పించేలా చేశాం.
ఇప్పుడు ఆ ఇబ్బందికర దశ మారింది. పాకిస్తాన్‌లో పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు పర్యటించాయి. రానున్న కాలంలో మరిన్ని జట్లు పర్యటనకు వస్తాయని ఆశిస్తున్నా. ఇక క్రికెట్ గ్రౌండ్స్ ప్రేక్షకులతో నిండిపోతుండడం సంతోషంగా అనిపిస్తుంది. ''అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఆఖరిమెట్టుపై బోల్తా పడింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓటమి పాలయ్యింది. బెన్ స్టోక్స్, సామ్ కరన్‌లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ రెండోసారి చాంపియన్‌గా అవతరించింది. సూపర్-12 దశలోనే ఇంటిముఖం పట్టాల్సిన పాకిస్తాన్ అనూహ్యంగా సెమీస్ చేరడం.. అక్కడ కివీస్‌ను ఓడించడం.. ఆపై ఫైనల్‌కు వెళ్లింది. ఇక ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో చిత్తయిన పాక్ రన్నరప్‌గా నిలిచింది.
చదవండి: టీమిండియా ఫేవరెట్ ఏంటి..? ఆ జట్టుకు అంత సీన్ లేదు.. నాన్సెన్స్..!
Comments
Please login to add a commentAdd a comment