సెయింట్ జాన్స్ (అంటిగ్వా): న్యూజిలాండ్‌తో వచ్చే నెలలో మొదలయ్యే టి20, టెస్టు సిరీస్‌లకు వెస్టిండీస్ జట్లను ప్రకటించింది. టెస్టు జట్టులోకి డారెన్ బ్రేవో, హెట్‌మైర్, కీమో పాల్ పునరాగమనం చేయగా... బ్యాట్స్‌మన్ షై హోప్ ఉద్వాసనకు గురయ్యాడు. గత కొంత కాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న హోప్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. టెస్టు జట్టుకు సారథిగా జేసన్ హోల్డర్ వ్యవహరించనున్నాడు. వికెట్ కీపర్ ఆండ్రూ ఫ్లెచర్ 2018 తర్వాత తొలిసారి టి20 జట్టులో స్థానం దక్కించుకోవడం విశేషం.
కరోనా నేపథ్యంలో తాము న్యూజిలాండ్ పర్యటనలో పాల్గొనలేమని ఆల్‌రౌండర్ ఆండ్రూ రసెల్, ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్, ఎవిన్ లూయిస్‌లు విండీస్ బోర్డుకు తెలియజేయడంతో వారిని పరిగణనలోకి తీసుకోలేదు. టి20 జట్టుకు కీరన్ పొలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. వెస్టిండీస్... న్యూజిలాండ్ పర్యటనను టి20 సిరీస్‌తో ఆరంభించనుంది. నవంబర్ 27, 29, 30వ తేదీల్లో మూడు టి20లను ఆడనున్న కరీబియన్ జట్టు... డిసెంబర్ 3–7, 11–15 మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల్లో కివీస్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment