తమ్ముడితో కలిసి అదరగొట్టిన షమీ.. ఆస్ట్రేలియా పయనం అప్పుడే!.. బుమ్రా స్థానంలో? | Is Shami To Join Team India after 2nd Test vs Aus Proved Fitness Check Details | Sakshi
Sakshi News home page

తమ్ముడితో కలిసి అదరగొట్టిన షమీ.. ఆస్ట్రేలియా పయనం అప్పుడే!.. బుమ్రా స్థానంలో?

Published Fri, Nov 15 2024 6:31 PM | Last Updated on Fri, Nov 15 2024 7:08 PM

Is Shami To Join Team India after 2nd Test vs Aus Proved Fitness Check Details

టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ పునరాగమనంలో అదరగొడుతున్నాడు. బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ 2024-25 బరిలో దిగిన ఈ ఫాస్ట్‌బౌలర్‌ మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌తో కాంపిటేటివ్‌ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చీరాగానే బంతితో పాటు బ్యాట్‌తోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

ఇండోర్‌ వేదికగా బెంగాల్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య మధ్యప్రదేశ్‌తో తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో తమ మొదటి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్‌ 167 పరుగులకే కుప్పకూలింది.

తమ్ముడితో కలిసి అదరగొట్టిన షమీ
ఇందులో షమీతో పాటు అతడి తమ్ముడు మహ్మద్‌ కైఫ్‌ పాత్ర కీలకం. షమీ 54 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా.. కైఫ్‌ రెండు వికెట్లు కూల్చాడు. ఇతరుల్లో సూరజ్‌ సింధు జైస్వాల్‌ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 61 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన బెంగాల్‌.. 276 పరుగులకు ఆలౌట్‌ అయింది.

ఇందులో షమీ చేసిన పరుగులు 37. కేవలం 36 బంతుల్లోనే అతడు ఈ మేర రన్స్‌ స్కోరు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో మహ్మద్‌ షమీ చిన్ననాటి కోచ్‌ మహ్మద్‌ బద్రుద్దీన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షమీ త్వరలోనే ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరతాడని తెలిపాడు.

రెండో టెస్టు తర్వాత షమీ భారత జట్టుతో కలుస్తాడు
ఈ మేరకు.. ‘‘అడిలైడ్‌లో రెండో టెస్టు తర్వాత షమీ భారత జట్టుతో కలుస్తాడు. అతడు రీఎంట్రీలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నాడు. వికెట్లు తీస్తున్నాడు. ఆసీస్‌ పర్యటన రెండో అర్ధ భాగంలో జట్టు అతడి సేవలు కీలకంగా మారనున్నాయి’’ అని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో బద్రుద్దీన్‌ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి సైతం షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. 

బుమ్రా స్థానంలో?
ఇరుజట్ల మధ్య నవంబరు 22న పెర్త్‌ వేదికగా ఈ సిరీస్‌ మొదలుకానుంది. అయితే, ఆసీస్‌తో టెస్టులకు బీసీసీఐ జట్టును ఎంపిక చేసిన నాటికి షమీ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదు. అందుకే అతడి పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. 

అయితే, ఇప్పుడు కాంపిటేటివ్‌ క్రికెట్‌లో షమీ సత్తా చాటుతున్నాడు కాబట్టి త్వరలోనే ఆస్ట్రేలియా విమానం ఎక్కే అవకాశం ఉంది. మరోవైపు.. టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఐదు టెస్టులకు అందుబాటులో ఉండకపోవచ్చని భారత జట్టు బౌలింగ్‌ మాజీ కోచ్‌ పారస్‌ మాంబ్రే పేర్కొనడం విశేషం. దీంతో బుమ్రా స్థానంలో షమీ మిగిలిన టెస్టులు ఆడతాడా అనే విశ్లేషణలు మొదలయ్యాయి.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్‌), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్‌), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాశ్‌ దీప్, ప్రసిద్‌ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్‌ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.

చదవండి: Champions Trophy: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement