Ind vs Eng: అతడికి గాయం.. భారత జట్టులోకి శివం దూబే! | Shivam Dube To Join India Squad For Eng T20Is Replacement for Nitish Reddy: Report | Sakshi
Sakshi News home page

Ind vs Eng: అతడికి గాయం.. భారత జట్టులోకి శివం దూబే!

Published Sat, Jan 25 2025 5:13 PM | Last Updated on Sat, Jan 25 2025 5:36 PM

Shivam Dube To Join India Squad For Eng T20Is Replacement for Nitish Reddy: Report

ముంబై ఆల్‌రౌండర్‌ శివం దూబే(Shivam Dube) టీమిండియాతో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత అతడు భారత టీ20 జట్టులో పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా యువ సంచలనం నితీశ్‌ కుమార్‌ రెడ్డి(Nitish Kumar Reddy) స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడని సమాచారం.

లంక పర్యటనలో ఆఖరిగా
కాగా టీ20 ప్రపంచకప్‌-2024(T20 World Cup 2024) గెలిచిన భారత జట్టులో భాగమైన శివం దూబే ఆ తర్వాత.. శ్రీలంకతో టీ20లలో ఆడాడు. అనంతరం సొంతగడ్డపై జరిగిన బంగ్లాదేశ్‌తో పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌కు ఎంపిక చేసి జట్టులో.. అదే విధంగా సౌతాఫ్రికాకు వెళ్లిన టీమ్‌లోనూ శివం దూబేకు సెలక్టర్లు చోటివ్వలేదు.

తాజా రంజీ మ్యాచ్‌లో డకౌట్లు
ఈ క్రమంలో అతడు తన సొంత జట్టు ముంబై తరఫున దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ, రంజీ మ్యాచ్‌లలోనూ భాగమయ్యాడు. తాజాగా జమ్మూ కశ్మీర్‌తో శనివారం ముగిసిన మ్యాచ్‌లోనూ శివం దూబే ఆడాడు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయిన ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ సున్నా చుట్టాడు.

నితీశ్‌ రెడ్డికి గాయం?
అయితే, ఈ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఓ వికెట్‌ మాత్రం తన ఖాతాలో వేసుకోగలిగాడు. అయితే, అనూహ్యంగా శివం దూబేకు టీమిండియా మేనేజ్‌మెంట్‌ నుంచి పిలుపు వచ్చినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం పేర్కొంది. ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా గాయపడిన మరో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి.. స్థానాన్ని దూబేతో భర్తీ చేసినట్లు తెలిపింది.

అయితే, నితీశ్‌ రెడ్డి గాయం తాలూకు వివరాలు మాత్రం పూర్తిగా వెల్లడికాలేదు. కానీ వెంటనే అతడు మైదానంలో దిగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని సమాచారం. కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతోంది. ఇందులో భాగంగా కోల్‌కతాలో బుధవారం తొలి మ్యాచ్‌ జరిగింది.

తొలి టీ20లో భారత్‌ విజయం
ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా సాగిన ఈ టీ20లో సూర్యకుమార్‌ సేన ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసన బట్లర్‌ బృందం 132 పరుగులకే ఆలౌట్‌ కాగా.. 12.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయిన భారత్‌ లక్ష్యాన్ని ఛేదించింది.

ఇక ఈ మ్యాచ్‌లో నితీశ్‌ కుమార్‌ రెడ్డికి బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ చసే అవకాశం కూడా రాలేదు. కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా టెస్టుల్లోనూ అరంగేట్రం చేసిన ఈ ఆంధ్ర క్రికెటర్‌.. ప్రఖ్యాత మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో చిరస్మరణీయ శతకం సాధించాడు. 

దూబే జట్టుతో చేరేది అపుడే
అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో బిజీ అయిన 21 ఏళ్ల నితీశ్‌.. దురదృష్టవశాత్తూ గాయపడినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇండియా- ఇంగ్లండ్‌ మధ్య చెన్నై వేదికగా శనివారం రెండో టీ20 జరుగనుంది. అయితే, ఇదే రోజు రంజీ మ్యాచ్‌ ముగించుకున్న శివం దూబే ఇప్పటికిప్పుడు భారత జట్టుతో చేరలేడు. రాజ్‌కోట్‌లో మంగళవారం జరిగే మూడో టీ20 నుంచి అతడు టీమిండియాతో చేరనున్నట్లు సమాచారం.  మరోవైపు.. యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. 

చదవండి: ICC టీ20 జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ, నో కోహ్లి! భారత్‌ నుంచి నలుగురు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement