Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆట తీరుపై విమర్శలు చేయడం సరికాదని పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. కోహ్లి ఫామ్‌లేమి గురించి విమర్శించే వారు.. ఒక్కసారి అతడు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలన్నాడు. ఓ క్రికెటర్‌గా, అత్యుత్తమ ఆటగాడిగా గౌరవం పొందేందుకు కోహ్లి అర్హుడని పేర్కొన్నాడు. కాగా గతేడాది నుంచి ఫామ్‌లేమితో ఈ ‘రన్‌మెషీన్’ ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ ఆరంభానికి ముందే టీమిండియా పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెబుతానన్న కోహ్లి.. మెగా టోర్నీలో ఘోర పరాభవంతో సారథ్య బాధ్యతలకు ముగింపు పలికాడు. ఆ తర్వాత అనూహ్య రీతిలో వన్డే కెప్టెన్సీ నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. ఇక ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సుదీర్ఘకాలంగా సారథిగా వ్యవహరించిన కోహ్లి.. గతేడాది ఆ బాధ్యతల నుంచి కూడా వైదొలిగాడు.
ఇక కెప్టెన్సీ భారం లేకపోవడంతో ఈ సీజన్‌లోనైనా బ్యాట్ ఝులిపిస్తాడనుకుంటే.. పూర్తిగా నిరాశపరిచాడు. ఐపీఎల్-2022లో పదహారు మ్యాచ్‌లలో కలిపి కోహ్లి సాధించిన పరుగులు 341. సగటు 22.73. కేవలం రెండు అర్ధ శతకాలు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇయాన్ బిషప్, వీరేంద్ర సెహ్వాగ్, డేనియల్ వెటోరీ వంటి మాజీ ఆటగాళ్లు కోహ్లి ఫామ్‌పై విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ కోహ్లికి అండగా నిలిచాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘కొంతమంది స్టేట్‌మెంట్లు ఇచ్చే ముందు కాస్త ముందూ వెనుకా ఆలోచించాలి. చిన్న పిల్లలు కూడా ఈ విషయాలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి కోహ్లి గురించి, అతడి ఆట గురించి కాస్త మంచి మాటలు చెప్పండి. గౌరవం పొందేందుకు అతడు అన్ని విధాలా అర్హుడు.
ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్. అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో 110 సెంచరీలు చేయాలని నేను కోరుకుంటున్నా. 45 ఏళ్లు వచ్చే వరకు కోహ్లి క్రికెట్ ఆడుతూనే ఉండాలి’’ అంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా.. ‘‘110 సెంచరీలకు చేరువయ్యే క్రమంలో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నపుడు కొంతమంది నిన్ను తారస్థాయిలో విమర్శిస్తారు. నీకు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తారు.
నువ్వు దీపావళి గురించి ట్వీట్ చేసినా అందులో తప్పులు వెతుకుతారు. నీ భార్య, బిడ్డ గురించి కామెంట్లు చేస్తారు. నువ్వు వరల్డ్‌కప్‌లో ఓడిపోతే దారుణంగా విమర్శలు చేస్తారు. ఇలాంటివి అన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీదైన శైలిలో ముందుకు సాగు. విరాట్ కోహ్లి అంటే ఏంటో వాళ్లకు ఒక్కసారి చూపించు’’ అని అక్తర్ కోహ్లికి మద్దతుగా నిలిచాడు.
చదవండి: Rafael Nadal: జొకోవిచ్‌కు షాకిచ్చిన నాదల్.. వరల్డ్ నంబర్ 1 ఘోర పరాజయం
Comments
Please login to add a commentAdd a comment