బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగుతోన్న పింక్ బాల్ టెస్టులో తొలి రోజు టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆటముగిసే సమయానికి 30 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులే చేయగలిగింది. అంతకు ముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా 252 పరుగులు చేయడంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ 98 బంతుల్లో 92 పరుగులు చేశాడు. పిచ్ బౌలర్లకు అనుకూలించడంతో తక్కువ వ్యవధిలో భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో అయ్యర్ అద్భత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.
స్పిన్నర్లపై అయ్యర్ విరుచుకు పడ్డాడు. ధనంజయ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లతో అయ్యర్ 54 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 92 పరుగులు చేసి సెంచరీ చేరువగా ఉన్న సమయంలో అయ్యర్ స్టంపౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో అయ్యర్ ఓ అవాంఛిత రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. టెస్టుల్లో 90 పరుగులు దాటాక స్టంపౌటైన నాలుగో భారత ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. దీంతో భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ,వీరేంద్ర సెహ్వాగ్, దిలీప్ వెంగ్‌సర్కార్ సరసన చేరాడు.
2001లో బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో 90 పరుగులు చేసిన సచిన్.. నాసిర్ హుస్సేన్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు.. ఇక 2010లో కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టులో సెహ్వాగ్ 99 పరుగుల వద్ద స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అదే విధంగా 90 పరుగులు దాటాక స్టంపౌటైన తొలి భారత క్రికెటర్‌గా దిలీప్ వెంగ్‌సర్కార్ నిలిచాడు. 1987లో పాకిస్తాన్‌పై 96 పరుగుల వద్ద వెంగ్‌సర్కార్ స్టంపౌటయ్యాడు.
చదవండి: Ind Vs SL 2nd Test: చెలరేగిన శ్రేయస్ అయ్యర్.. తొలి రోజు టీమిండియాదే!
Comments
Please login to add a commentAdd a comment