న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై కివీస్‌తో టీ20, వన్డేలకు పదిహేడు మందితో కూడిన జట్లను ఎంపిక చేసినట్లు తెలిపింది. చరిత్ అసలంక వన్డే జట్టుకు సారథిగా కొనసాగనుండగా.. మాజీ కెప్టెన్ దసున్ షనకకు ఈ జట్టులో స్థానం లభించలేదు.
వారికి మొండిచేయి
ఇక వరల్డ్‌కప్-2023 తర్వాత కుశాల్ పెరీరా తొలిసారిగా వన్డే జట్టులో చోటు దక్కించుకోగా.. మహ్మద్ షిరాజ్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మరోవైపు.. షనకతో పాటు పేసర్ దుష్మంత చమీరాకు మరోసారి మొండిచేయి ఎదురుకాగా.. భనుక రాజపక్స కూడా జట్టుతో కొనసాగనున్నాడు.
టీమిండియా, విండీస్‌లపై వరుస సిరీస్ విజయాలు
కాగా చరిత్ అసలంక కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత శ్రీలంక వన్డేల్లో అద్వితీయ విజయాలు సాధించింది. స్వదేశంలో తొలుత టీమిండియాను 2-1తో చిత్తు చేసి సిరీస్ గెలుచుకున్న లంక.. తర్వాత వెస్టిండీస్‌తో సిరీస్‌లోనూ ఇదే ఫలితం పునరావృతం చేసింది.
ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ సత్తా చాటేందుకు అసలంక బృందం సిద్ధమైంది. కాగా ఇటీవల శ్రీలంకలో పర్యటించిన న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. అయితే, వెంటనే ఇండియా టూర్‌లో 3-0తో ఆతిథ్య జట్టును వైట్‌వాష్ చేసి చారిత్రాత్మక విజయం సాధించింది.
ఇప్పుడు మరోసారి పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు కివీస్ జట్టు శ్రీలంకకు తిరిగి రానుంది. ఇందులో భాగంగా రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. నవంబరు 8, 10 తేదీల్లో లంక- కివీస్ మధ్య టీ20లకు డంబుల్లా ఆతిథ్యం ఇవ్వనుండగా.. నవంబరు 13, 17, 19 తేదీల్లో వన్డే సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
న్యూజిలాండ్‌తో వన్డేలకు శ్రీలంక జట్టు
చరిత్ అసలంక (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, పాతుమ్ నిసాంకా, కుశాల్ జనిత్ పెరీరా, కుశాల్ మెండిస్, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, సదీర సమరవిక్రమ, నిషాన్ మదుష్క, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, చమిదు విక్రమసింఘే, అసితా ఫెర్నాండో, దిల్షాన్ మదుశంక, మహ్మద్ షిరాజ్.
న్యూజిలాండ్‌తో టీ20లకు శ్రీలంక జట్టు
చరిత్ అసలంక, పాతుమ్ నిసాంకా, కుశాల్ మెండిస్, కుశాల్ జనిత్ పెరీరా, కమిందు మెండిస్, దినేష్ చండీమాల్, అవిష్కా ఫెర్నాండో, భనుక రాజపక్స, వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, జెఫ్రీ వాండర్సే, చమిదు విక్రమసింఘే, నువాన్ తుషార, మతీషా పతిరానా, బినూరా ఫెర్నాండో, అసితా ఫెర్నాండో.
చదవండి: Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే
Comments
Please login to add a commentAdd a comment