Smart Ball In CPL: ఈ క్రికెట్‌ బంతి చాలా స్మార్ట్‌ గురూ​.. దీనిపై ఓ లుక్కేయండి - Sakshi
Sakshi News home page

CPL 2021: ఈ క్రికెట్‌ బంతి చాలా స్మార్ట్‌ గురూ​.. దీనిపై ఓ లుక్కేయండి

Published Fri, Aug 27 2021 7:45 PM | Last Updated on Sat, Aug 28 2021 9:48 AM

Smart Ball To Be Introduced In CPL 2021 - Sakshi

సెయింట్‌ కిట్స్‌: కరీబియన్ గడ్డపై ధనాధన్ సందడి(సీపీఎల్-2021) మొదలైంది. ఐపీఎల్‌ను మరిపించేలా భారీ షాట్లతో కనువిందు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధ్వంసకర యోధులు మన ముందుకు వచ్చేశారు. అయితే, ఈ లీగ్‌కు సంబంధించిన ఓ అంశం క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. సీపీఎల్-2021 సీజన్‌ ద్వారా ఓ సరికొత్త టెక్నాలజీ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. 

ఇప్పటికే స్నికో మీటర్, హాట్ స్పాట్, అల్ట్రా ఎడ్జ్, స్పీడ్ గన్స్, స్టంప్ మైక్రోఫోన్స్ అనే పలు టెక్నాలజీలు ఆటలో భాగం కాగా, తాజాగా ఈ జాబితాలోకి స్మార్ట్ బాల్ వచ్చి చేరింది. ఈ స్మార్ట్ బాల్‌ను సీపీఎల్-2021 లీగ్‌లోనే మొదటి సారిగా ఉపయోగిస్తున్నారు. ప్రముఖ బంతుల తయారీ సంస్థ కూకాబురాతో కలిసి ‘స్పోర్ట్‌కోర్‌' అనే కంపెనీ దీన్ని రూపొందించింది.
చదవండి: వివాదంలో చిక్కుకున్న పంత్‌.. మందలించి వదిలిపెట్టిన అంపైర్లు

ఆకారం, బరువు అన్ని విషయాల్లోనూ ఇది సాధారణ బంతిలానే ఉంటుంది. కాకపోతే ఈ బంతి లోపల కార్క్‌ స్థానంలో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చి తయారు చేస్తారు. ఈ చిప్‌కున్న సెన్సార్ల సాయంతో బంతి నేల మీద పడ్డాక దాని వేగం, స్పిన్(నిమిషానికి ఎన్నిసార్లు తిరుగుతుంది), బౌలర్‌ శక్తి తదితర విషయాలను బ్లూటూత్‌ సాంకేతికత ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఓ ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించారు. ఈ యాప్‌లో ఓ బటన్‌ నొక్కితే బంతిలోని సెన్సార్లు సమాచారాన్ని గ్రహించి వాటిని బ్లూటూత్‌ ద్వారా పంపిస్తాయి. 

ఆ పంపిన సమాచారం ఫోన్‌ లేదా కంప్యూటర్‌ తెరలపై సగటున 5 సెకన్లలో ప్రత్యక్షమవుతుంది. ఈ బంతిలోని చిప్‌లో ఉండే బ్యాటరీ 30 గంటల పాటు పనిచేస్తుంది. కాగా, ప్రస్తుతం ఉన్న సాంకేతికత ఆధారంగా బౌలర్‌ చేతి నుంచి విడుదలైన బంతి పిచ్‌ను తాకే ముందు ఉన్న వేగాన్ని మాత్రమే కనుక్కోవచ్చు. ఈ స్మార్ట్‌ బాల్‌ రాకతో క్రికెట్‌ కొత్త పుంతలు తొక్కనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రస్తుతానికి ఈ బంతులు అంతర్జాతీయ క్రికెట్‌లో వాడేందుకు అనుమతి లభించలేదు. పూర్తి స్థాయి టెస్టింగ్ అనంతరం అనుమతి లభించే అవకాశం ఉంది.
చదవండి: మనతో ఆట అంటే మజాకా.. రికార్డులు బద్దలవ్వాల్సిందే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement