SMAT 2022: Shubman Gill Scores 49 Ball Century VS Karnataka - Sakshi
Sakshi News home page

శివాలెత్తిన శుభ్‌మన్‌ గిల్‌.. 11 ఫోర్లు, 9 సిక్సర్లతో విధ్వంసకర శతకం

Published Tue, Nov 1 2022 4:12 PM | Last Updated on Tue, Nov 1 2022 6:24 PM

SMAT 2022: Shubman Gill Scores 49 Ball Century VS Karnataka - Sakshi

SMAT 2022 Quarter Final 1 PUN VS KAR: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2022లో భాగంగా ఇవాళ (నవంబర్‌ 1) జరిగిన తొలి క్వార్టర్‌ ఫైనల్లో పంజాబ్‌-కర్ణాటక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 9 పరుగుల తేడాతో గెలుపొంది సెమీఫైనల్‌కు చేరుకుంది. టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌.. శుభ్‌మన్‌ గిల్‌ (55 బంతుల్లో 126) విధ్వంసకర శతకంతో రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు భారీ స్కోర్‌ చేసింది.

గిల్‌కు జతగా అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (43 బంతుల్లో 59; 9 ఫోర్లు) బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీతో రాణించాడు. కేవలం 49 బంతుల్లోనే కెరీర్‌లో తొలి టీ20 శతకం బాదిన గిల్‌.. 11 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంసం సృష్టించాడు. కర్ణాటక బౌలర్లలో విధ్వత్‌ కావేరప్ప 3 వికెట్లు పడగొట్టగా.. కృష్ణప్ప గౌతమ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

అనంతరం 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ, ఆతర్వాత గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. అభినవ్‌ మనోహర్‌ (29 బంతుల్లో 62 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మనీశ్‌ పాండే (29 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మనోజ్‌ భాండగే (9 బంతుల్లో 25; ఫోర్‌, 3 సిక్సర్లు), కృష్ణప్ప గౌతమ్‌ (14 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), చేతన్‌ (25 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్‌) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.

వీరి పోరాటంతో కర్ణాటక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేయగలిగింది. పంజాబ్‌ బౌలర్లలో రమన్‌దీప్‌ సింగ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. సిద్ధార్ధ్‌ కౌల్‌, బల్తేజ్‌ సింగ్‌, అశ్వనీ కుమార్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

కాగా, ఇవాళే జరిగిన మరో రెండు క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఢిల్లీపై విధర్భ.. బెంగాల్‌పై హిమాచల్‌ ప్రదేశ్‌ గెలుపొందాయి. హిమాచల్‌.. బెంగాల్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందగా.. ఢిల్లీపై విధర్భ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. సాయంత్రం 4:30 గంటలకు ముంబై-సౌరాష్ట్ర జట్ల మధ్య నాలుగో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement