ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 ఎడిషన్ రసవత్తరంగా సాగుతోంది. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్ తదితరులు ఈ టోర్నీలో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇక ఈ టీ20 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. మధ్యప్రదేశ్, బరోడా, ముంబై, ఢిల్లీ జట్లు టాప్-4లో అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్స్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ టైమింగ్స్ తదితర అంశాలను గమనిద్దాం. అంతకంటే ముందు.. ఈ నాలుగు జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన తీరుపై ఓ లుక్కేద్దాం.
పృథ్వీ షా, సూర్యాంశ్, శివమ్ దూబే మెరుపులు
గ్రూప్ ‘ఇ’ టాపర్‌గా క్వార్టర్స్‌లో అడుగు పెట్టిన ముంబై అదే జోరు కొనసాగిస్తూ విదర్భను మట్టికరిపించింది. ఆలూరులో బుధవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో విదర్భపై గెలుపొందింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన విదర్భ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అథర్వ తైడె (41 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్), అపూర్వ్ వాంఖడె (33 బంతుల్లో 51; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించగా... శుభమ్ దూబే (19 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసి గెలిచింది.
సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... పృథ్వీ షా (26 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి బంతి నుంచే ఓపెనర్లు విరుచుకుపడటంతో 7 ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు 83 పరుగులు చేసింది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5), సూర్యకుమార్ యాదవ్ (9) విఫలం కాగా... ఆఖర్లో శివమ్ దూబే (37 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), సూర్యాంశ్ (36 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. రహానేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది.
వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షో
ఆలూరు: పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (33 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు; 2/23) ఆకట్టుకోవడంతో... సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట సౌరాష్ట్ర 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులు చేసింది. చిరాగ్ జానీ (45 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
మధ్యప్రదేశ్ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో మధ్యప్రదేశ్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. అరి్పత్ గౌడ్ (42; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ రజత్ పాటిదార్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. చివర్లో హర్‌ప్రీత్ సింగ్ (9 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి జట్టును గెలిపించాడు.
హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, 3 క్యాచ్‌లు
బెంగళూరు: బెంగాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బరోడా 41 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ చేరింది. బరోడాకు ఆడుతున్న భారత స్టార్ హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టడంతోపాటు 3 క్యాచ్‌లు తీసుకున్నాడు. మొదట బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
శాశ్వత్ రావత్ (40; 1 ఫోర్, 3 సిక్స్‌లు), అభిమన్యు సింగ్ (37; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. బెంగాల్ బౌలర్లలో షమీ, కనిష్క్ సేత్, ప్రతీప్తా ప్రమాణిక్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగాల్ తడబడింది. 18 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌రౌండర్ షహబాజ్ అహ్మద్ (36 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. బరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, లుక్మన్ మెరివాలా, అతిత్ సేత్ తలా మూడేసి వికెట్లు పడగొట్టారు.
అనూజ్ అదుర్స్
బెంగళూరు: వికెట్ కీపర్ అనూజ్ రావత్ (33 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసకర అర్ధశతకంతో చెలరేగడంతో ఢిల్లీ జట్టు ముస్తాక్ అలీ టోర్నీ సెమీఫైనల్‌కు చేరింది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీ జట్టు 19 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్ జట్టుపై నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసింది.
అనూజ్ రావత్‌తో పాటు ఓపెనర్లు యశ్ ధుల్ (42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రియాన్ష్ ఆర్య (44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో ఉత్తరప్రదేశ్ జట్టు 20 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది.
యువ ఆటగాడు ప్రియం గార్గ్ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో పోరాడగా... రింకూ సింగ్ (10), నితీశ్ రాణా (2) విఫలమవడంతో ఉత్తరప్రదేశ్‌కు పరాజయం తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3... ఆయుష్ బదోనీ, సుయాశ్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
సెమీ ఫైనల్స్ షెడ్యూల్, వేదిక, టైమింగ్స్
తొలి సెమీ ఫైనల్:
👉ముంబై వర్సెస్ బరోడా- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం- డిసెంబరు 13(శుక్రవారం)- ఉదయం 11 గంటలకు ఆరంభం.
రెండో సెమీ ఫైనల్:
👉మధ్యప్రదేశ్ వర్సెస్ ఢిల్లీ- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం- డిసెంబరు 13(శుక్రవారం)- సాయంత్రం 4.30 నిమిషాలకు ఆరంభం.
ఇప్పటి వరకు అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు సాధించింది వీరే
సకీబుల్ గనీ ఈ సీజన్‌లో 353 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్‌గా ఉండగా.. కరణ్ లాల్ 338, అభిషేక్ పోరెల్ 335, అజింక్య రహానే 334, తిలక్ వర్మ 327 పరుగులు సాధించారు.
మరోవైపు.. జగ్జీత్ సింగ్ 18 వికెట్లతో టాప్ బౌలర్‌గా ఉండగా.. కుమార్ కార్తికేయ 15, ముకేశ్ చౌదరి 15చ శ్రేయస్ గోపాల్ 14, కేవీ శశికాంత్ 14 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
చదవండి: బుమ్రా తర్వాత బెస్ట్ బౌలర్.. భీకర ఫామ్‌లో ఆర్సీబీ పేసర్
Comments
Please login to add a commentAdd a comment