ఈ దశాబ్దంలో అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ కోహ్లి పేరు కచ్చితంగా కనిపిస్తుంది.. వినిపిస్తుంది. ఎందుకంటే భారత్‌కు దొరికిన ఆణిముత్యం కోహ్లి. ముద్దుగా ''రన్ మెషిన్.. ''కింగ్ కోహ్లి'' అని పిలుచుకునే అతను ఇప్పుడు మాత్రం పరుగులు తీయడానికి నానాపాట్లు పడుతున్నాడు. ఒక దశలో సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్న కోహ్లి అప్పుడప్పుడు అర్థసెంచరీలతో మెరుస్తున్నా.. సెంచరీ మార్క్‌ను మాత్రం అందుకోలేకపోతున్నాడు.
కోహ్లి సెంచరీ చేసి దాదాపు నాలుగేళ్లు కావొస్తుంది. ఒక క్రికెటర్‌గా ఎనలేని క్రేజ్ సంపాదించిన కోహ్లి అతి తక్కువ కాలంలోనే జట్టులో చోటు కోల్పోయే పరిస్థితికి దిగజారిన వైనం తెలుసుకోవాలంటే ఈ ఏడాదిన్నరలో కోహ్లీ ఫేస్ చేసిన పరిస్థితులను చూస్తే తెలిసిపోతుంది.
తాజాగా గురువారం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కాగా ప్రకటించిన జట్టులో కోహ్లీ పేరు లేకపోవడతో అతన్ని కావాలనే తప్పించారనే వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. టి20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు విరాట్ కోహ్లీని తప్పించడంతో అతను పొట్టి ప్రపంచకప్ ఆడతాడా? అనే సందేహం కలుగుతుంది.
వెస్టిండీస్ టూర్‌లో వన్డే, టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఆసియా కప్ 2022 టోర్నీలో పాల్గొనబోతోంది భారత జట్టు. విండీస్ టూర్‌లో టి20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, ఆసియా కప్‌లో రీఎంట్రీ ఇస్తాడా? అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు . తన 14 ఏళ్ల కెరీర్‌లో గాయం కారణంగా విరాట్ కోహ్లీ ఆడని మ్యాచుల సంఖ్య నాలుగంటే నాలుగే. వరుసగా రెండు మ్యాచులకు దూరమైన సంఘటనలే లేవు. అలాంటిది బీసీసీఐతో విభేదాలున్నాయని వార్తలు వస్తున్న సమయంలో గాయం పేరు చెప్పి వరుసగా మ్యాచులకు దూరం కావడం పెను దుమారం రేపుతోంది.
అయితే వెస్టిండీస్ సిరీస్ నుంచి విశ్రాంతి కావాలని స్వయంగా విరాట్ కోహ్లీయే భారత క్రికెట్ బోర్డును కోరినట్టు సమాచారం. ఈ మధ్యకాలంలో సరిగ్గా పరుగులు చేయలేకపోతున్న కోహ్లీ, ఫామ్‌పై దృష్టి పెట్టేందుకు రెస్ట్ కావాలని కోరాడా? లేక కూతురితో కలిసి ఇంకాస్త ఎక్కువ సమయం గడిపేందుకు బ్రేక్ అడిగాడా? అన్న దానిపై స్పష్టత లేదు.
2019లో 25 వన్డేలు ఆడి 5 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, 2020లో లాక్‌డౌన్ కారణంగా 9 వన్డేలు మాత్రమే ఆడి 6 హాఫ్ సెంచరీలు చేశాడు. 2021లో 3 వన్డేలు ఆడి 2 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఈ ఏడాది 6 వన్డేలు ఆడి 2 హాఫ్ సెంచరీలు చేశాడు.అయినా ఫామ్‌లో లేడనే వంకతో కోహ్లీని బీసీసీఐ సైడ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ వంటి ప్లేయర్లు వరుసగా విఫలమవుతున్నా వారిని ఏనాడూ జట్టు నుంచి తప్పించే సాహసం చేయలేదు బీసీసీఐ. ఎందుకంటే వాళ్లు జట్టుకి చేసిన సేవలకు బోర్డు ఇచ్చిన గౌరవం అది.
ఆ ఇద్దరితో సమానమైన హోదాను అనుభవించిన విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం బోర్డుతో పొసగకపోవడమే కారణం. ఏదైనా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో విరాట్ కోహ్లీ పేరు లేకపోవడంతో ఇన్ని రకాల ఊహాగానాలు పుట్టుకొచ్చాయి.దీనికి ప్రధాన కారణం విరాట్ కోహ్లి మునుపటి ఫామ్‌లో లేకపోవడమే. ఒకవేళ కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉంటే జట్టు నుంచి తప్పించే సాహసం కాదు కదా.. అసలు కెప్టెన్సీ తొలగించే ధైర్యం కూడా ఎవ్వరూ చేసేవాళ్లు కాదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
చదవండి: Heinrich Klaseen: క్లాసెన్ సుడిగాలి శతకం.. సౌతాఫ్రికా భారీ స్కోర్
Comments
Please login to add a commentAdd a comment