ఆసియా కప్-2023 కోసం 17 మంది సభ్యుల భారత జట్టును సెలెక్టర్లు ఇవాళ (ఆగస్ట్ 21) ప్రకటించిన విషయం తెలిసిందే. జట్టు ఎంపికలో ఎలాంటి సంచనాలకు తావివ్వని సెలెక్టర్లు, ఒకరిద్దరికి మొండిచెయ్యి చూపించారన్నది కాదనలేని సత్యం.
ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లే.. చహల్‌ను తీసుకోవాల్సింది..!
స్పిన్నర్ల ఎంపికలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తుంది. ఎంపిక చేసిన స్పెషలిస్ట్ స్పిన్నర్లంతా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్లే (అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్) కావడం చర్చనీయంశంగా మారింది. రైట్ ఆర్మ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ను ఎంపిక చేయాల్సిందని మెజార్టీ శాతం అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
శిఖర్ ధవన్‌కు ఆఖరి ఛాన్స్ ఇవ్వాల్సింది..
ఆసియా కప్‌కు ప్రకటించిన భారత జట్టులో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్‌కు అవకాశం ఇవ్వాల్సిందని సోషల్‌మీడియా వేదికగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ధవన్‌కు ఆసియా కప్‌లో (వన్డే) ఘనమైన ట్రాక్ రికార్డు (9 మ్యాచ్‌ల్లో 59.33 సగటున 91.43 స్ట్రయిక్‌రేట్‌తో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 534 పరుగులు) ఉండటం ఇందుకు ఓ కారణమైతే, వయసు పైబడిన రిత్యా అతనికి ప్రూవ్ చేసుకునేందుకు చివరి అవకాశం ఇచ్చి ఉండాల్సిందని అంటున్నారు.
ధవన్‌ను ఎంపిక చేసుంటే రోహిత్‌తో పాటు లైఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కూడా వర్కవుట్ అయ్యుండేదని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, ధవన్ భారత్ తరఫున 2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలు, 2015 వన్డే వరల్డ్‌కప్, 2018 ఆసియా కప్‌లలో భారత లీడింగ్ రన్ స్కోరర్ అని గుర్తు చేస్తున్నారు. వన్డే ఫార్మాట్‌లో ధవన్ దిగ్గజమని, అతన్ని గౌరవించాల్సిన బాధ్యత సెలెక్టర్లపైన ఉండిందని అంటున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టు టాపార్డర్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు కేవలం ఇద్దరు మాత్రమే (ఇషాన్, తిలక్) ఉన్నారని, యువకులైన వారిద్దరిలో ఒకరి ప్రత్యామ్నాయంగా ధవన్ పేరును పరిశీలించి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
సంజూ వర్సెస్ సూర్యకుమార్..
ఆసియా కప్ భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయడంపై కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. స్కైకి బదులు సంజూ శాంసన్‌ను 17 మంది సభ్యుల జట్టులోకి ఎంపిక చేసి ఉండాల్సిందని అంటున్నారు. జట్టులో ఇద్దరు వికెట్‌కీపింగ్ బ్యాటర్లను పెట్టుకుని సంజూని ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేయడం కేవలం కంటి తుడుపు ఎంపిక మాత్రమేనని అభిప్రాయపడుతున్నారు.
గడిచిన కొన్ని వన్డేల్లో సంజూ ప్రదర్శన స్కైతో పోలిస్తే చాలా రెట్లు మెరుగ్గా ఉందని, సంజూకు వికెట్‌కీపర్‌గానూ మంచి రికార్డు ఉంది కాబట్టి, అతన్ని స్కై స్థానంలో ఎంపిక చేసి ఉండాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు. సంజూని ఎంపిక చేయడం వల్ల కేఎల్ రాహుల్‌పై భారం కాస్త తగ్గుతుందని, శాంసన్ ఎలాగూ స్కై లాగే విధ్వంసకర ఆటగాడు కాబట్టి, శాంసన్, రాహుల్‌లను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉండేదని అంటున్నారు.
యశస్విని తీసుకుని ఉండాల్సింది..
ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల సంఖ్య చాలా తక్కువగా (ఇషాన్, తిలక్) ఉందని, ఇది జట్టు ప్రయోజనాలను దెబ్బ తీస్తుందని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఎవరైనా రైట్ హ్యాండ్ బ్యాటర్ స్థానంలో సూపర్ ఫామ్‌లో యశస్వి జైస్వాల్‌ను తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment