వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్లోకి
తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 125 పరుగులతో జయభేరి
కెప్టెన్ వోల్‌వార్ట్ చిరస్మరణీయ సెంచరీ
5 వికెట్లతో మెరిసిన మరిజాన్ కాప్
గువాహటి: ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో దక్షిణాఫ్రికా మహిళల జట్టు అనుకున్నది సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. నాలుగుసార్లు చాంపియన్ ఇంగ్లండ్ జట్టుతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 125 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బ్యాట్‌తో కెపె్టన్ లారా వోల్‌వార్ట్ (143 బంతుల్లో 169; 20 ఫోర్లు, 4 సిక్స్‌లు)... బంతితో మరిజాన్ కాప్ (5/20) అదరగొట్టి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. మొదట దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 319 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ వోల్‌వర్ట్ అసాధారణ ఆటతీరుతో ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టింది. బ్రిట్స్ (65 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్), మరిజాన్ కాప్ (42; 4 ఫోర్లు, 1 సిక్స్), ట్రియాన్ (33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. సఫారీ బౌలర్ల ధాటికి స్కోరు బోర్డుపై ఒక పరుగుకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఆ తర్వాత కాస్త ప్రతిఘటించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
కెప్టెన్ నటాలియా సివర్ బ్రంట్ (76 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్), అలీస్ కాప్సీ (71 బంతుల్లో 50; 6 ఫోర్లు) పోరాడారు. అమీ జోన్స్ (0), బ్యూమౌంట్ (0), హీథర్ నైట్ (0) డకౌట్ కావడంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. డంక్లీ (2), చార్లీ డీన్ (0) కూడా విఫలమయ్యారు. నేడు భారత్, ఆ్రస్టేలియా మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికా తలపడనుంది.


