3–0తో సిరీస్ కైవసం
మూడో టి20లోనూ బంగ్లాదేశ్ ఓటమి
చట్టోగ్రామ్: బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్ జట్టు... టి20 సిరీస్‌లో అదరగొట్టింది. ఇప్పటికే సిరీస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు చివరి మ్యాచ్‌లోనూ ఆతిథ్య బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో ‘క్లీన్ స్వీప్’ చేసింది. శుక్రవారం జరిగిన నామమాత్రమైన పోరులో విండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్ తన్జీద్ హసన్ (62 బంతుల్లో 89; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. జట్టు మొత్తంలో తన్జీద్‌తో పాటు సైఫ్ హసన్ (22 బంతుల్లో 23; 2 సిక్స్‌లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. తక్కినవాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కెపె్టన్ లిటన్ దాస్ (6), పర్వేజ్ హుసేన్ (9), రిషాద్ హుసేన్ (3), నూరుల్ హసన్ (1), నసుమ్ అహ్మద్ (1), జాకీర్ అలీ (5) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు చేరుకున్నారు.
ఒక ఎండ్‌లో తన్జీద్ పాతుకుపోయినా... మరో ఎండ్‌లో వికెట్ల పతనం ఆగలేదు. ఒక్క బ్యాటర్ కూడా ప్రతిఘటించే ప్రయత్నం చేయకుడానే పెవిలియన్ బాట పట్టారు. అయినా పట్టుదలతో ఆడిన తన్జీద్ జట్టుకు పోరాడే స్కోరు సాధించి పెట్టాడు. వెస్టిండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ హ్యాట్రిక్ పడగొట్టగా... జాసెన్ హోల్డర్, ఖారీ పియర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ జట్టు 16.5 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 152 పరుగులు చేసింది.
కెప్టెన్ రోస్టన్ చేజ్ (29 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్), అకీమ్ అగస్టె (25 బంతుల్లో 50; ఒక ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధశతకాలతో అలరించారు. వికెట్ కీపర్ అమీర్ జాంగో (34; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. బ్రాండన్ కింగ్ (8), అలిక్ అథనాజె (1) విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషాద్‌హుసేన్ 3 వికెట్లు పడగొట్టాడు. రోస్టన్ చేజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, రొమారియో షెఫర్డ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.


