
సన్‌రైజర్స్ (PC: IPL/BCCI)
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన ఆట తీరుతో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు(287) నమోదు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడ్డ దుస్థితి నుంచి.. ఈసారి ఏకంగా ఫైనల్ రేసులో నిలిచే స్థాయికి చేరుకుంది.
కనీసం ప్లే ఆఫ్స్ చేరినా చాలంటూ ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఎదురుచూస్తున్న వేళ.. విధ్వంసకర ఆట తీరుతో ఏకంగా క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. ఇంకొక్క ఆటంకం దాటితే చాలు.. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా అర్హత సాధించే అవకాశం ముంగిట నిలిచింది.
ప్రధాన కారణాలు ఇవే
ఇక ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ అద్భుత విజయాలకు ప్రధాన కారణం విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ్యూహాలు, కోచ్ డానియల్ వెటోరీ ప్రణాళికలు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సారథిగా కమిన్స్ జట్టును గెలుపు బాట పట్టించడంలో పూర్తిగా విజయవంతమయ్యాడు.
ప్రత్యర్థి జట్ల వ్యూహాలను చిత్తు చేస్తూ మైదానంలో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగి సన్‌రైజర్స్ విన్‌రైజర్స్‌గా మార్చడంలో సఫలమయ్యాడు ఈ పేస్ బౌలర్. ఒత్తిడి నెలకొన్న సమయాల్లోనూ ఏమాత్రం సహనం కోల్పోకుండా ఆటగాళ్లకు అండగా నిలుస్తూ ఫలితాలు రాబడుతున్నాడు. ఫ్రాంఛైజీ తన కోసం ఖర్చు పెట్టిన రూ. 20.50 కోట్లకు పూర్తి న్యాయం చేస్తూ పైసా వసూల్ ప్రదర్శన ఇస్తున్నాడు.
మరో అవకాశం కూడా ఉంది
ఇక కమిన్స్ సారథ్యంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సన్‌రైజర్స్ క్వాలిఫయర్-1లోనూ ఇదే జోష్ కనబరిస్తే.. టైటిల్‌కు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలుస్తుంది.
ఒకవేళ కేకేఆర్‌తో ఈ మ్యాచ్‌లో ఓడినా క్వాలిఫయర్-2 రూపంలో కమిన్స్ బృందానికి మరో అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎలా చూసినా ఈసారి సన్‌రైజర్స్‌కు ఫైనల్ చేరేందుకు సానుకూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు.
ఫైనల్స్‌లో అడుగుపెట్టడమే తరువాయి
ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా సొంతమైదానం ఉప్పల్‌లో సన్‌రైజర్స్ ఆదివారం.. ఈ సీజన్ లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్ ఆడింది. పంజాబ్ కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
అనంతరం కేకేఆర్- రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ రద్దు కావడంతో రెండో స్థానాన్ని మరింత పదిలం చేసుకుని క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో కమిన్స్ స్పందిస్తూ.. ‘‘ఉప్పల్‌లో మరో అద్భుతమైన రోజు. మాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. ఇక మనం ఫైనల్స్‌లో అడుగుపెట్టడమే తరువాయి’’ అని అభిమానులను ఉత్సాహపరిచాడు.
ఈసారి కచ్చితంగా తుదిపోరుకు అర్హత సాధిస్తామని ఈ సందర్భంగా కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా కేకేఆర్- సన్‌రైజర్స్ మధ్య క్వాలిఫయర్-1కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఇదే గడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే: పాక్ లెజెండ్
Locked and loaded for Qualifier 1 🔥💪#PlayWithFire #KKRvSRH pic.twitter.com/nkTpipX0I8
— SunRisers Hyderabad (@SunRisers) May 21, 2024
Comments
Please login to add a commentAdd a comment