‘సన్‌’ సత్తా సరిపోలేదు  | SRH vs KKR IPL 2021: Kolkata Knight Riders Beat SRH By 10 Runs | Sakshi
Sakshi News home page

‘సన్‌’ సత్తా సరిపోలేదు 

Published Mon, Apr 12 2021 2:40 AM | Last Updated on Mon, Apr 12 2021 1:54 PM

SRH vs KKR IPL 2021: Kolkata Knight Riders Beat SRH By 10 Runs - Sakshi

‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నితీశ్‌ రాణా

భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఓపెనర్లు శుభారంభం ఇవ్వాలి. మిడిల్‌ ఆర్డర్‌ నిలకడ చూపాలి. చివర్లో ధనాధన్‌ షాట్లు ఆడాలి. కానీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విషయంలో అలా జరగలేదు. ఓపెనర్లు విఫలం కాగా... మిడిల్‌ ఆర్డర్‌లో బెయిర్‌స్టో, మనీశ్‌ పాండే పోరాడి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను లక్ష్యం దిశగా నడిపించారు. అయితే బెయిర్‌స్టో అవుటయ్యాక వచ్చిన బ్యాట్స్‌మెన్‌ ఆశించినస్థాయిలో దూకుడుగా ఆడలేకపోవడంతో హైదరాబాద్‌ విజయానికి దూరమైపోయింది. చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 10 పరుగుల తేడాతో విజయాన్ని అందుకొని గెలుపు బోణీ చేసింది.   

చెన్నై: గత ఐదు సీజన్‌లలో నిలకడగా ఆడుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ఈసారి శుభారంభం లభించలేదు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ బృందం 10 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) చేతిలో ఓడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు సాధించింది. నితీశ్‌ రాణా (56 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి (29 బంతుల్లో 53; 5 ఫోర్లు 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. రషీద్‌ ఖాన్, నబీ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం హైదరాబాద్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసి పరాజయం పాలైంది. మనీశ్‌ పాండే (44 బంతుల్లో 61 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), బెయిర్‌స్టో (40 బంతుల్లో 55; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో పోరాడినా హైదరాబాద్‌ను విజయతీరానికి చేర్చలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ రెండు వికెట్లు తీయగా... కీలకమైన బెయిర్‌స్టో వికెట్‌ను కమిన్స్‌ దక్కించుకొని తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 


మనీశ్‌ పాండే

వార్నర్‌ విఫలం... 
భారీ లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌కు ఆరంభంలోనే దెబ్బ పడింది. హర్భజన్‌ వేసిన తొలి ఓవర్‌ నాలుగో బంతికి వార్నర్‌ ఇచ్చిన క్యాచ్‌ను కమిన్స్‌ జారవిడిచాడు. అయితే వార్నర్‌ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో వార్నర్‌ (3) కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. సిక్స్‌ కొట్టి జోరు మీదున్నట్లు కనిపించిన మరో ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా (7) షకీబ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. దాంతో హైదరాబాద్‌ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో జతకట్టిన బెయిర్‌స్టో, మనీశ్‌ పాండేలు క్రీజులో కుదురుకున్నాక స్వేచ్ఛగా షాట్లు ఆడారు. ముఖ్యంగా బెయిర్‌స్టో సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. వరుణ్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ కొట్టిన బెయిర్‌స్టో 32 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.


వార్నర్‌ను అవుట్‌ చేశాక ప్రసిద్‌ కృష్ణ సంబరం

అయితే 13వ ఓవర్‌ వేయడానికి వచ్చిన కమిన్స్‌ మ్యాచ్‌ గతిని మార్చేశాడు. ఆ ఓవర్‌ తొలి 5 బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే రావడంతో ఒత్తిడికి గురైన బెయిర్‌స్టో చివరి బంతిని బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లోకి ఆడగా... అక్కడే ఉన్న నితీశ్‌ రాణా ఒడిసి పట్టుకున్నాడు. దాంతో 92 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. పాండే అడపాదడపా షాట్లు ఆడుతూ 37 బంతుల్లో హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. నబీ (11 బంతుల్లో 14; 2 ఫోర్లు), విజయ్‌ శంకర్‌ (7 బంతుల్లో 11; సిక్స్‌) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. చివర్లో అబ్దుల్‌ సమద్‌ (8 బంతుల్లో 19 నాటౌట్‌; 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. హైదరాబాద్‌ విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు అవసరం కాగా...  రసెల్‌ వేసిన ఈ ఓవర్‌లో సమద్, పాండే భారీ షాట్‌లు ఆడలేకపోవడంతో హైదరాబాద్‌ 11 పరుగులే రాబట్టగలిగింది.  

రాణా జోరు... 
అంతకుముందు కోల్‌కతా జట్టుకు ఓపెనర్లు గిల్‌ (15), నితీశ్‌ రాణా మెరుపు ఆరంభాన్నిచ్చారు. సందీప్‌ శర్మ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో రాణా రెచ్చిపోయాడు. వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. పవర్‌ప్లే ముగిసేసరికి కేకేఆర్‌ 50/0గా నిలిచింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని రషీద్‌ ఖాన్‌ విడదీశాడు. ఈ దశలో క్రీజులోకొచ్చిన రాహుల్‌ త్రిపాఠి... రాణాతో కలిసి జట్టును ముందుకు నడిపించాడు. త్రిపాఠి–రాణా జంట రెండో వికెట్‌కు 50 బంతుల్లో 93 పరుగులు జోడించింది. ఆ తర్వాత కూడా రాణా కొన్ని చూడచక్కని షాట్లు ఆడాడు. సెంచరీ వైపు దూసుకెళ్తున్న రాణాను నబీ పెవిలియన్‌కు చేర్చాడు. చివర్లో దినేశ్‌ కార్తిక్‌ (9 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా రసెల్‌ (5), కెప్టెన్‌ మోర్గాన్‌ (2), షకీబుల్‌ హసన్‌ (3) విఫలమయ్యారు. దాంతో కోల్‌కతా 41 పరుగుల వ్యవధిలో 5 వికెట్లను కోల్పోయి 200 మార్కును అందుకోలేకపోయింది.   

స్కోరు వివరాలు 
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: నితీశ్‌ రాణా (సి) శంకర్‌ (బి) నబీ 80; గిల్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 15; త్రిపాఠి (సి) సాహా (బి) నటరాజన్‌ 53; రసెల్‌ (సి) పాండే (బి) రషీద్‌ ఖాన్‌ 5; మోర్గాన్‌ (సి) సమద్‌ (బి) నబీ 2; దినేశ్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 22; షకీబ్‌ (సి) సమద్‌ (బి) భువనేశ్వర్‌ 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–53, 2–146, 3–157, 4–160, 5–160, 6–187.బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–45–1, సందీప్‌ శర్మ 3–0–35–0, నటరాజన్‌ 4–0–37–1, నబీ 4–0–32–2, రషీద్‌ ఖాన్‌ 4–0–24–2, విజయ్‌ శంకర్‌ 1–0–14–0. 
సన్‌రైజర్స్‌ హెదరాబాద్‌ ఇన్నింగ్స్‌: సాహా (బి) షకీబ్‌ 7; వార్నర్‌ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) ప్రసిధ్‌ కృష్ణ 3; మనీశ్‌ పాండే (నాటౌట్‌) 61; బెయిర్‌స్టో (సి) నితీశ్‌ రాణా (బి) కమిన్స్‌ 55; నబీ (సి) మోర్గాన్‌ (బి) ప్రసిధ్‌ కృష్ణ 14; విజయ్‌ శంకర్‌ (సి) మోర్గాన్‌ (బి) రసెల్‌ 11; సమద్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–10, 2–10, 3–102, 4–131, 5–150. బౌలింగ్‌: హర్భజన్‌ సింగ్‌ 1–0–8–0, ప్రసిధ్‌ కృష్ణ 4–0–35–2, షకీబ్‌ 4–0–34–1, కమిన్స్‌ 4–0–30–1, రసెల్‌ 3–0–32–1, వరుణ్‌ చక్రవర్తి 4–0–36–0.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement