SRH: అందుకే ఓడిపోయాం.. మా వాళ్లు మాత్రం సూపర్‌: కమిన్స్‌ | IPL 2024 KKR Crush SRH In Final: Cummins Says Were Outplayed Credit To Them | Sakshi
Sakshi News home page

SRH: అందుకే ఓడిపోయాం.. మా వాళ్లు మాత్రం సూపర్‌: కమిన్స్‌

Published Mon, May 27 2024 10:59 AM | Last Updated on Mon, May 27 2024 11:19 AM

IPL 2024 KKR Crush SRH In Final: Cummins Says Were Outplayed Credit To Them

సన్‌రైజర్స్‌ (PC: SRH X)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ముచ్చటగా మూడోసారి ఫైనల్‌ ఆడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో చెన్నై వేదికగా జరిగిన తుదిపోరులో పేలవ ప్రదర్శనతో పరాజయం పాలైంది. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

గతేడాదితో పోలిస్తే ఈ సీజన్‌ ఆసాంతం అద్భుతంగా ఆడినా అసలు మ్యాచ్‌లో చేతులెత్తేసింది. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారిన కమిన్స్‌ బృందం ఫైనల్లో మాత్రం తుస్సుమనిపించింది.

అందుకే ఓడిపోయాం
ఈ నేపథ్యంలో కేకేఆర్‌ చేతిలో ఘోర పరాజయంపై సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ విచారం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థి జట్టు అద్భుతంగా బౌలింగ్‌ చేసిందని కితాబులు ఇచ్చాడు. తమ బ్యాటర్లు సీజన్‌ ఆరంభం నుంచి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నారని.. అయితే, చెన్నై వికెట్‌ను అంచనా వేయడంలో తాము విఫలమయ్యామని పేర్కొన్నాడు.

‘‘వాళ్లు అత్యద్భుతంగా బౌలింగ్‌ చేశారు. స్టార్కీ(మిచెల్‌ స్టార్క్‌) మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చివేశాడు. ఈ మ్యాచ్‌లో మా ఆట తీరు అస్సలు బాగాలేదు. బౌండరీలు రాబట్టానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. 

అయినప్పటికీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాం. గత వారం అహ్మదాబాద్‌(క్వాలిఫయర్‌-1)లోనూ వాళ్ల బౌలర్లు అద్భుతంగా ఆడారు. కాబట్టి ఈ క్రెడిట్‌ మొత్తం వాళ్లకు ఇవ్వాల్సిందే. ఈ వికెట్‌ స్వభావాన్ని మేము పసిగట్టలేకపోయాం. కనీసం 160 పరుగులు స్కోరు చేసినా కనీస పోటీ ఉండేది’’ అని కమిన్స్‌ పేర్కొన్నాడు.

మా వాళ్లు మాత్రం సూపర్‌
అదే విధంగా.. ‘‘ఏదేమైనా.. ఈ సీజన్‌లో మాకు అనేక సానుకూలాంశాలు ఉన్నాయి. మా వాళ్లు సూపర్‌గా బ్యాటింగ్‌ చేశారు. మూడుసార్లు 250 పరుగుల మేర స్కోరు చేశాం.

తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ మ్యాచ్‌ను మాకు అనుకూలంగా మార్చివేశారు. హైదరాబాద్‌లో అభిమానులు మాకు పూర్తి మద్దతుగా నిలిచారు.

ఈ సీజన్‌ మొత్తం అద్భుతంగా సాగింది. ఈసారి చాలా మంది కొత్త ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం వచ్చింది. భువీ, నట్టు, జయదేవ్‌లతో పాటు చాలా మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో మమేకమయ్యాను.

సాధారణంగా టీమిండియాతో మ్యాచ్‌ అంటే మొత్తం నీలిరంగుతో స్టేడియం నిండిపోతుంది. అయితే, ఇప్పుడు ఇక్కడ ప్రేక్షకులు మా(నా)కు మద్దతుగా నిలవడం కొత్త అనుభూతినిచ్చింది’’ అని ప్యాట్‌ కమిన్స్‌ తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు.

ఐపీఎల్‌-2024 ఫైనల్‌: కేకేఆర్‌ వర్సెస్‌ సన్‌రైజర్స్‌
👉వేదిక: చెపాక్‌ స్టేడియం.. చెన్నై
👉టాస్‌: సన్‌రైజర్స్‌.. బ్యాటింగ్‌

👉సన్‌రైజర్స్‌ స్కోరు: 113 (18.3)
👉కేకేఆర్‌ స్కోరు: 114/2 (10.3)

👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసి చాంపియన్‌గా కేకేఆర్‌
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: మిచెల్‌ స్టార్క్‌
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌: సునిల్‌ నరైన్‌.

చదవండి: IPL 2024: ఎస్ఆర్‌హెచ్ ఓట‌మి.. వెక్కివెక్కి ఏడ్చిన కావ్య‌! వీడియో వైర‌ల్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement