IPL 2023: Rajasthan Royals Were Eliminated From IPL 2023 Playoff Race - Sakshi
Sakshi News home page

IPL 2023: పాపం రాజస్థాన్‌..!

Published Sun, May 21 2023 8:19 PM | Last Updated on Mon, May 22 2023 9:32 AM

SRH VS MI: Rajasthan Royals Bow Out Of IPL 2023 - Sakshi

PC: IPL Twitter

ఐపీఎల్‌ 2023 నుంచి గతేడాది రన్నరప్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ ఎలిమినేట్‌ అయ్యింది. ఇవాళ (మే 21) సన్‌రైజర్స్‌పై ముంబై ఇండియన్స్‌ విజయం సాధించడంతో రాజస్థాన్‌ అధికారికంగా లీగ్‌ నుంచి నిష్క్రమించింది. జట్టు నిండా స్టార్‌ ప్లేయర్లు, కెరీర్‌ టాప్‌ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు ఉన్నా.. ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా బరిలోకి దిగి లీగ్‌ మధ్యలో అనూహ్య పరాజయాలను ఎదుర్కొని తగిన మూల్యం చెల్లించుకుంది.

యశస్వి జైస్వాల్‌, జోస్‌ బట్లర్‌, హెట్‌మైర్‌, కెప్టెన్‌ సంజూ శాంసన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, అశ్విన్‌, చహల్‌, సందీప్‌ శర్మ.. ఇలా జట్టులో దాదాపు ప్రతి ఒక్కరు మ్యాచ్‌ విన్నర్లే అయినా కొన్ని వ్యూహాత్మక తప్పిదాల కారణంగా హిట్‌ కావాల్సిన జట్టు ఫట్‌ అయ్యింది. రాజస్థాన్‌ బాధాకర పరిస్థితుల్లో లీగ్‌ నుంచి నిష్క్రమించడంతో ఆ జట్టు అభిమానల బాధ వర్ణణాతీతంగా ఉంది.

పాపం, పాపం అనుకుంటూ తమను తామే సర్ధి చెప్పుకుంటున్నారు. జైస్వాల్‌ (14 మ్యాచ్‌ల్లో 625 పరుగులు), చహల్‌ (14 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు) సాధించిన ఘనతలను తలచుకుంటూ తృప్తి పడుతున్నారు. సోషల్‌మీడియా వేదికగా రాజస్థాన్‌పై సానుభూతి వెల్లువెత్తుతుంది. ఒకవేళ సన్‌రైజర్స్‌తో నేటి మ్యాచ్‌లో ముంబై ఓడిపోయినా, అలాగే గుజరాత్‌ చేతిలో ఆర్సీబీ ఓడినా రాజస్థాన్‌కు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఉండేవి. ఎస్‌ఆర్‌హెచ్‌పై ముంబై గెలుపుతో ఆర్సీబీ మ్యాచ్‌ వరకు కూడా ఉత్కంఠగా ఎదురుచూడకుండా ఐపీఎల్‌-2023లో రాజస్థాన్‌ భవిష్యత్తు తేలిపోయింది. ఆ జట్టు ప్రస్తుత సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి, ఆరో స్థానంతో ముగించింది. 

ఇదిలా ఉంటే, సన్‌రైజర్స్‌తో ఇవాల్టి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌.. వివ్రాంత్‌ శర్మ (69), మయాంక్‌ అగర్వాల్‌ (83) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. కెమారూన్‌ గ్రీన్‌ (47 బంతుల్లో 100 నాటౌట్‌) విధ్వంసకర సెంచరీతో చెలరేగడంతో ముంబై మరో 12 బంతులు మిగిలుండగానే సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. 

చదవండి: SRH VS MI: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement