ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శనతో అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, మహ్మద్ సిరాజ్ వంటి టాప్ స్టార్లు జట్టులో ఉన్నా వరుస వైఫల్యాలతో చతికిలపడింది.
ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి రెండు పాయింట్లతో పట్టికలో అట్టడుగున పదో స్థానంలో ఉంది. ఒక రకంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆర్సీబీ దాదాపుగా నిష్క్రమించినట్లే! అయితే, తిరిగి పుంజుకుంటే మాత్రం పోటీలో నిలిచే అవకాశం ఉంటుంది. అందుకు సాధ్యమయ్యే కొన్ని సమీకరణలు గమనిద్దాం!
మరోమాట లేదు.. గెలవాల్సిందే
మరోమాట లేకుండా ఆర్సీబీ ఇప్పటి నుంచి ఆడే అన్ని మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలవాలి. నెట్ రన్‌రేటు -1.046 మరీ దారుణంగా ఉంది కాబట్టి కచ్చితంగా భారీ విజయాలు సాధించాలి.
అదే జరిగితే.. ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లు చేరి మొత్తం 14 అవుతాయి. అదే విధంగా.. నెట్ రన్‌రేటు కూడా మెరుగుపరచుకుంటే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.
కాగా ఆర్సీబీకి తదుపరి సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్(రెండుసార్లు), పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇవన్నీ భారీ తేడాతో గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆర్సీబీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
టాప్‌లో ఉన్న ఆ మూడు జట్లు..
పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ తమకు మిగిలిన ఆరు మ్యాచ్‌లలో ఎన్ని గెలిస్తే(తమపై మినహా) ఆర్సీబీకి అంత మంచిది. లక్నో, చెన్నై, ఢిల్లీ, గుజరాత్, ముంబై, పంజాబ్ కింగ్స్ ఈ జట్లు భారీ తేడాతో విజయం సాధించడం ఆర్సీబీకి ముఖ్యం.
ఇంకెలా అంటే..
►తొమ్మిదో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ తమకు మిగిలిన ఆరు మ్యాచ్‌లలో నాలుగు కంటే ఎక్కువ విజయాలు సాధించకూడదు.
►ఢిల్లీ క్యాపిటల్స్ మిగిలిన ఐదింటిలో రెండు కంటే.. ముంబై ఇండియన్స్ ఆరింటిలో మూడు కంటే ఎక్కువ గెలవకూడదు.
►చెన్నై మిగిలిన ఆరు మ్యాచ్‌లలో రెండు కంటే.. గుజరాత్ ఐదింటిలో ఒకటి కంటే ఎక్కువ గెలవద్దు.
►లక్నో మిగిలిన ఆరు మ్యాచ్లలో ఒకటి కంటే ఎక్కువ గెలవకూడదు.
►కేకేఆర్, సన్‌రైజర్స్ మిగిలిని ఏడు మ్యాచ్‌లలో ఒకటి కంటే ఎక్కువ విజయాలు సాధిస్తే చాలు!
►ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరేందుకు కొన్ని సమీకరణలు మాత్రమే ఇవి. ఇంతా జరిగినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుతుందా అంటే? ఏమో గుర్రం ఎగరావచ్చు! లేదంటే గురువారం నాటి సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఓడి పూర్తిగా నిష్క్రమించనూవచ్చు!!
చదవండి: నువ్వు చాలా మంచోడివి ప్యాట్: కోహ్లి కామెంట్స్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment