పుణే: భారత్ విజయలక్ష్యం 207 పరుగులు... ఒక దశలో స్కోరు 57/5... మిగిలిన 65 బంతుల్లో మరో 150 పరుగులు చేయాలి...భారీ ఓటమి ఖాయమనిపించింది...అయితే ఈ దశలో అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) అనూహ్యంగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఒకే ఒక్కసారి 30కి పైగా పరుగులు (గత మ్యాచ్‌లోనే) చేసిన అతను ఈ సారి విధ్వంస ప్రదర్శనతో చెలరేగిపోయాడు.
మరో వైపునుంచి సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా సత్తా చాటడంతో భారత్ గెలుపు ఆశలు పెరిగాయి. వీరిద్దరు 40 బంతుల్లోనే 91 పరుగులు జోడించారు. అయితే 26 బంతుల్లో 59 పరుగులు చేయాల్సిన స్థితిలో సూర్య వెనుదిరగడంతో ఛేదన కష్టంగా మారిపోగా... అక్షర్ ఆఖరి ఓవర్ మూడో బంతికి అవుట్ కావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. చివరకు 16 పరుగుల తేడాతో గెలిచి శ్రీలంక ఊపిరి పీల్చుకుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దసున్ షనక (22 బంతుల్లో 56 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), కుశాల్ మెండిస్ (31 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 190 పరుగులు చేసి ఓడింది.
మెరిపించిన మెండిస్
ఓపెనర్లు కుశాల్ మెండిస్, నిసాంక లంక ఇన్నింగ్స్‌ను వేగంగా నడిపించారు. 27 బంతుల్లో (3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించిన మెండిస్‌ను చహల్ అవుట్ చేశాడు. అసలంక (19 బంతుల్లో 37; 4 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝళిపించాడు. 17వ ఓవర్ ముగిసేసరికి కూడా షనక (7 బంతుల్లో 6) పది పరుగులైనా చేయలేదు. కానీ ఆఖరి మూడు ఓవర్లలో అతను విధ్వంసం సృష్టించాడు. అర్ధ సెంచరీ (20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో) సాధించి లంక తరఫున టి20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన బ్యాటర్‌గా షనక రికార్డులకెక్కాడు.
చెత్త బౌలింగ్
లంక 200 పైచిలుకు స్కోరులో భారత బౌలర్లు శివమ్ మావి (0/53), ఉమ్రాన్ (3/48) ఇద్దరే 101 పరుగులు సమరి్పంచుకోవడం విశేషం. అర్‡్షదీప్ కేవలం 2 ఓవర్ల స్పెల్ మాత్రమే వేసి 37 పరుగులు ఇచ్చాడు. ఏకంగా 5 నోబాల్స్ వేయడం కూడా లంక భారీ స్కోరుకు అవకాశమిచి్చంది. దీంతో పాటు మరో 2 నోబాల్స్ కలిపి మొత్తం ‘7 నోబాల్’లు చివరకు భారత్ ఓటమిలో కీలకంగా నిలిచాయి.
టాపార్డర్ విఫలం...
భారత్ ముందు కొండంత లక్ష్యం వుంటే టాపార్డర్ 21 పరుగులకే డగౌట్ చేరింది. ఇషాన్ (2), గిల్ (5), త్రిపాఠి (5) చెత్త షాట్లతో అవుటయ్యారు. కెప్టెన్ పాండ్యా (12; 1 ఫోర్, 1 సిక్స్) పవర్‌ప్లేలోనే వెనుదిరిగాడు. కాసేపటికి దీపక్ హుడా (9) అవుట్ కావడంతో 57 పరుగులకే సగం వికెట్లు కూలాయి.
ఆశలు రేపిన అక్షర్ సిక్సర్లు...
పదో ఓవర్లో అక్షర్ వచ్చీ రాగానే హసరంగ ఓవర్లో సిక్సర్ బాదాడు. ఆ తర్వాత కరుణరత్నే బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన అక్షర్ 13వ ఓవర్ వేసిన తీక్షణ బౌలింగ్‌లో బౌండరీ, భారీ సిక్సర్ బాదాడు. దీంతో లంక కెపె్టన్ తమ స్టార్ స్పిన్నర్ హసరంగను దించితే అక్షర్ చుక్కలు చూపించాడు. స్వీప్, స్లాగ్‌స్వీప్, లాఫ్టెడ్ షాట్లతో ‘హ్యాట్రిక్’ సిక్సర్లు బాదాడు. తర్వాత పరుగు తీసివ్వగా, సూర్యకుమార్ ఐదో బంతిని ఎక్స్‌ట్రా కవర్ దిశగా సిక్స్ కొట్టాడు. దీంతో ఈ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి. తర్వాత కరుణరత్నేకు ఇద్దరు సిక్సర్లతో తమ ధాటిని చూపెట్టారు. 20 బంతుల్లోనే అక్షర్ (2 ఫోర్లు, 6 సిక్సర్లు) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. సూర్యకుమార్ కూడా భారీ సిక్సర్‌తో (33 బంతుల్లో; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీని అధిగమించాడు. శివమ్ మావి (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కొంత పోరాడినా లాభం లేకపోయింది.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) త్రిపాఠి (బి) అక్షర్ 33; కుశాల్ (ఎల్బీ) (బి) చహల్ 52; రాజపక్స (బి) ఉమ్రాన్ 2; అసలంక (సి) శుబ్‌మన్ (బి) ఉమ్రాన్ 37; ధనంజయ (సి) హుడా (బి) అక్షర్ 3; షనక నాటౌట్ 56; హసరంగ (బి) ఉమ్రాన్ 0; కరుణరత్నే నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–80, 2–83, 3–96, 4–110, 5–138, 6–138.
బౌలింగ్: హార్దిక్ 2–0–13–0, అర్ష్‌దీప్ 2–0–37–0, శివమ్ మావి 4–0–53–0, అక్షర్ 4–0–24–2, చహల్ 4–0–30–1, ఉమ్రాన్ 4–0–48–3.
భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ (బి) రజిత 2; గిల్ (సి) తీక్షణ (బి) రజిత 5; త్రిపాఠి (సి) మెండిస్ (బి) మదుషంక 5; సూర్యకుమార్ (సి) హసరంగ (బి) మదుషంక 51; పాండ్యా (సి) మెండిస్ (బి) కరుణరత్నే 12; హుడా (సి) ధనంజయ (బి) హసరంగ 9; అక్షర్ (సి) కరుణరత్నే (బి) షనక 65; మావి (సి) తీక్షణ (బి) షనక 26; ఉమ్రాన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–12, 2–21, 3–21, 4–34, 5–57, 6–148, 7–189, 8–190.
బౌలింగ్: మదుషంక 4–0–45–2, రజిత 4–0–22–2, కరుణరత్నే 4–0–41–1, హసరంగ 3–0–41–1, తీక్షణ 4–0–33–0, షనక 1–0–4–2.
Comments
Please login to add a commentAdd a comment