శ్రీలంకలో ఎప్పుడో ఆగిపోయిన నవ్వులు శనివారం మళ్లీ పూశాయి. లంకలో ఆ నవ్వులు ఎందుకు ఆగిపోయాయో అందరికి తెలిసిందే. గత రెండేళ్లలో కరోనా మహమ్మారి.. ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం వరుసగా లంకను చుట్టుముట్టాయి. పర్యాటకానికి కేంద్రంగా ఉండే లంకలో ముఖ్యంగా కరోనా తర్వాత తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో అక్కడి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. తినడానికి తిండి లేక విలవిల్లాడారు.
ప్రభుత్వాన్ని గద్దె దిగాలంటూ నిరసనలు వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం మారడంతో లంకలో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. ఏడాదిగా ప్రభుత్వం చర్యలతో విసిగిపోయిన ప్రజలకు మానసిక సంతోషం చాలా అవసరం అనిపించింది. ఆ సంతోషాన్ని అక్కడి ప్రజలు క్రికెట్ ద్వారా కోరుకున్నారని నిన్నటి మ్యాచ్‌తో తెలిసింది.. కాదు తెలిసేలా చేశాడు లంక కెప్టెన్ దాసున్ షనక..
లంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా మొదట ఆస్ట్రేలియా జట్టు పర్యటనకు వస్తుందా అన్న అనుమానం వచ్చింది. కానీ ఆసీస్ క్రికెట్ బోర్డు ఇవేమి పట్టించుకోలేదు. ఆపదలో ఉన్న లంక బోర్డును ఆదుకునేందుకు ఆసీస్ జట్టు మూడు టి20, ఐదు వన్డేలు, రెండు టెస్టుల ఆడేందుకు ఆ గడ్డపై అడుగుపెట్టింది. తొలి రెండు టి20లను గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్‌ను కైవసం చేసుకున్నప్పటికి శనివారం జరిగిన మూడో టి20లో అనూహ్యంగా ఓటమి చవిచూసింది.
లంక కెప్టెన్ దాసున్ షనక అసాధ్యాన్ని సుసాధ్యం చేసి కొత్త చరిత్ర సృష్టించాడు. ఆఖరి మూడు ఓవర్లలో 59 పరుగులు అవసరమైన దశలో షనక 25 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి మరో బంతి మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. అంతే.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల్లో సంతోషం కట్టలు తెచ్చుకుంది. ఏదో సాధించామన్న ఫీలింగ్ అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరిలో కనిపించింది. లంక అభిమానుల మొహాల్లో చాలా కాలం తర్వాత నవ్వు మళ్లీ విరిసింది. ఆ నవ్వుకు కారణమయ్యాడు దాసున్ షనక.
ముఖ్యంగా మ్యాచ్ చూసేందుకు వచ్చిన చిన్నపిల్లలు సైతం మ్యాచ్ గెలిచామంటూ ఉద్వేగంతో వారిచ్చిన హావభావాలు అందరిని ఆకట్టుకున్నాయి. మొన్నటివరకు తినడానికి తిండి లేక అల్లల్లాడిపోయిన అక్కడి పిల్లల్లో ఈ ఆనందం చూసి మనకు కడుపు నిండినట్లయింది. క్రీడలు.. బాధలో ఉన్న వ్యక్తులకు ప్రశాంతత ఇవ్వడంతో పాటు సంతోషాన్ని పంచుతాయని లంక, ఆసీస్ మ్యాచ్ ద్వారా మరోసారి తెలియవచ్చింది. దీనికి సంబంధించిన వీడియోనూ లంక కెప్టెన్ షనక స్వయంగా ట్విటర్‌లో షేర్ చేశాడు. ''మా ప్రజల్లో నవ్వు మళ్లీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది.'' అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి.. ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. వార్నర్ 39, స్టోయినిస్ 38, స్టీవ్ స్మిత్ 37 నాటౌట్, ఫించ్ 29 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన లంక్.. షనక ఇన్నింగ్స్ 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఇక మూడు టి20ల సిరీస్‌లో క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకున్న లంక.. విజయంతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొని వన్డేలకు సిద్ధమవుతుంది.
I’m very happy to see these smiling faces of my people 😇🇱🇰 pic.twitter.com/H4yQDmLpjj
— Dasun Shanaka (@dasunshanaka1) June 11, 2022
చదవండి: 3 ఓవర్లలో 59 పరుగులు.. శ్రీలంక సంచలన విజయం..
థ్రిల్లింగ్ మ్యాచ్ తర్వాత తన్నుకున్న భారత్, అఫ్గానిస్తాన్ ప్లేయర్స్
Comments
Please login to add a commentAdd a comment