క్రికెట్‌లో పెను విషాదం.. ఆటగాళ్ల దాడిలో శ్రీలంక‌ కోచ్ మృతి | Sri Lanka Coach-Demise-Kusal Mendis Childhood-Mentor-After Players Brawl | Sakshi
Sakshi News home page

క్రికెట్‌లో పెను విషాదం.. ఆటగాళ్ల దాడిలో శ్రీలంక‌ కోచ్ మృతి

Aug 14 2026 7:35 AM | Updated on Aug 14 2026 8:33 AM

Sri Lanka Coach-Demise-Kusal Mendis Childhood-Mentor-After Players Brawl

కోచ్‌ సుమిత్‌ ఫెర్నాండో, లంక క్రికెటర్‌ కుశాల్‌ మెండిస్‌(Photo Credit: Twitter)

శ్రీలంక క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్రికెట‌ర్ల మ‌ధ్య జ‌రిగిన దాడిలో 62 ఏళ్ల లంక క్రికెట్‌ కోచ్ సుమిత్ ఫెర్నాండో క‌న్నుమూశారు. కొలంబోలో మ్యాచ్ సంద‌ర్భంగా జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ఇది చోటుచేసుకుంది. దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన ఫెర్నాండో గురువారం రాత్రి చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు.

కాగా సుమిత్ ఫెర్నాండో గతంలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుశాల్ మెండిస్‌కు పాఠశాల స్థాయిలో కోచ్‌గా వ్యవహరించారు. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. ఆగ‌స్టు 8న‌ ఒక క్రీడా ప్రాంగణంలో శిక్షణ పొందుతున్న కొంతమంది యువ క్రికెటర్లు తాగునీటి కోసం వెళ్లగా, అక్క‌డ నీటి వ‌స‌తి అందుబాటులో లేదు. ఈ విషయంపై ఆటగాళ్లకు, స్టేడియం సిబ్బందికి మధ్య వాగ్వాదం జ‌రిగింది. 

పరిస్థితి ముద‌ర‌డంతో సుమిత్‌ ఫెర్నాండో జోక్యం చేసుకున్నారు. దీంతో ఇద్దరు యువ క్రికెట‌ర్లు కోచ్ ఫెర్నాండోపై భౌతిక దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన సుమిత్ ఫెర్నాండోను కొలంబో జాతీయ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కాగా ఆయ‌న చికిత్స పొందుతూ మ‌ర‌ణించ‌డంతో లంక క్రికెట్ విషాదంలో మునిగిపోయింది.

మొరటువాలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజీలో మాజీ కోచ్‌గా పనిచేసిన ఫెర్నాండో.. పలువురు పాఠశాల స్థాయి క్రికెటర్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయన శిక్షణ ఇచ్చిన వారిలో ఒకరైన మెండిస్.. ఆ తర్వాత శ్రీలంక వన్డే కెప్టెన్‌గా ఎదిగారు. అనంతరం ఫెర్నాండో.. శ్రీలంక దేశీయ క్రికెట్ వ్యవస్థలో ఒక ప్రముఖ క్లబ్ అయిన బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్ & అథ్లెటిక్ క్లబ్‌లో గ్రౌండ్స్ క్యూరేటర్‌గా పనిచేశారు.

అయితే సుమిత్ ఫెర్నాండోతో ఘర్షణకు దిగిన ఇద్దరు ఆటగాళ్లలో ఒక 17 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. ఇప్పుడు, ఆ గొడవ జరిగిన దాదాపు వారం రోజుల తర్వాత, కొలంబో పోలీసులు ఆ కుర్రాడిని అరెస్టు చేశారు. కోచ్ ఫెర్నాండోపై దాడి చేశాడనే అనుమానంతో అతడిని అరెస్టు చేశారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నందున, అతను ఆగస్టు 17 వరకు కస్టడీలో ఉండే అవకాశం ఉంది. అతని ప్రాథమిక కస్టడీని కోర్టు పొడిగించినట్లు సమాచారం.

చదవండి: సెంచరీ దిశగా తంజిద్‌.. ఆసీస్‌కు చుక్కలు చూపిస్తున్న బంగ్లా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement