వరల్డ్‌కప్ వార్మప్ గేమ్స్ కూడా ప్రేక్షకులకు కావాల్సినంత మజాను అందిస్తున్నాయి. తొలి వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఖంగుతిన్న శ్రీలంక.. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 3) జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్‌లో ఇరగదీస్తుంది. ఈ మ్యాచ్‌లో లంక తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు మోస్తున్న కుశాల్ మెండిస్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 59 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు.
సెంచరీ అనంతరం కూడా కుశాల్ మెండిస్ ఏమాత్రం తగ్గకుండా చెలరేగిపోతుండటంతో శ్రీలంక భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 25 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 197/2గా ఉంది. పథుమ్ నిస్సంక (30), దిముత్ కరుణరత్నే (8) ఔట్ కాగా.. కుశాల్ మెండిస్ (76 బంతుల్లో 135; 18 ఫోర్లు, 7 సిక్సర్లు), సదీర సమరవిక్రమ (23 బంతుల్లో 12; ఫోర్) క్రీజ్‌లో ఉన్నారు. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
కాగా, ఇవాళ ఈ మ్యాచ్‌తో పాటు మరో రెండు వార్మప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో పాకిస్తాన్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుండగా.. తిరువనంతపురంలో జరగాల్సిన భారత్-నెదార్లండ్స్ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమవుతూ వస్తుంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 31 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.
డేవిడ్ వార్నర్ (48), లబూషేన్ (40), మిచెల్ మార్ష్ (31), స్టీవ్ స్మిత్ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. అలెక్స్ క్యారీ (11) నిరాశపరిచాడు. మ్యాక్స్‌వెల్ (20), గ్రీన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఉసామా మిర్ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రౌఫ్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment