Srilanka Tour Of India 2022: భారత్-శ్రీలంక జట్ల మధ్య ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్న టీ20, టెస్ట్ సిరీస్‌లకు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను బీసీసీఐ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. శ్రీలంక ఈ పర్యటనలో ముందుగా ప్రకటించిన విధంగా తొలుత టెస్ట్ సిరీస్ కాకుండా టీ20లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 ఫిబ్రవరి 24న లక్నోలో, రెండు, మూడో టీ20లు 26, 27 తేదీల్లో ధర్మశాలలో జరగనున్నాయి. అనంతరం తొలి టెస్ట్ మార్చి 4 నుంచి మొహాలీ వేదికగా, రెండో టెస్ట్ మార్చి 12 నుంచి బెంగళూరులో జరగనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. బెంగళూరు వేదికగా జరిగబోయే టెస్ట్ మ్యాచ్‌ను డే అండ్ నైట్ టెస్ట్(పింక్ బాల్)గా నిర్వహించబోతున్నట్టు బీసీసీఐ అధికారికంగా ఖరారు చేసింది.
ఇదిలా ఉంటే, కోహ్లి వందో టెస్ట్(శ్రీలంకతో తొలి టెస్ట్) విషయంలో బీసీసీఐ బాస్ గంగూలీ కొద్ది రోజుల ముందు ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చేసైనా కోహ్లి మైలురాయి టెస్ట్‌ని, అతనికి ప్రత్యేక అనుబంధం ఉన్న బెంగళూరులో(ఐపీఎల్) నిర్వహిస్తామని, అందులోనూ అది డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్ట్‌గా ఉంటుందని ప్రకటించాడు. అయితే, బీసీసీఐ తాజాగా వేదికల మార్పు అంశాన్ని పక్కన పెట్టి.. కోహ్లి కెరీర్‌లో అరుదైన మైలురాయిగా నిలిచే 100వ టెస్ట్ మ్యాచ్‌ని బెంగళూరు నగరంలో కాకుండా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మొహాలిలో నిర్వహించేందుకు సిద్దమైంది .
ఇది విరాట్ కోహ్లితో పాటు ఆర్సీబీ అభిమానులకు పుండు మీద కారం చల్లినట్లుగా అనిపిస్తుంది. షెడ్యూల్ మార్పు విషయంలో శ్రీలంక క్రికెట్ బోర్డు అభ్యర్ధనను మన్నించి, ముందుగా టీ20 సిరీస్‌కు అనుమితిచ్చిన బీసీసీఐ, కోహ్లికి చిరకాలం గుర్తుండిపోయే టెస్ట్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా యధాతథంగా కొనసాగించడాన్ని కోహ్లి సహా ఆర్సీబీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కాగా, కెరీర్‌లో ఇప్పటివరకు 99 టెస్ట్‌లు ఆడిన కోహ్లికి ఐపీఎల్ కారణంగా బెంగళూరుతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌తో కలుపుకుని మొత్తం 15 సీజన్ల పాటు అతను నిరాటంకంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కే ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ చరిత్రలో మరే ఇతర ఆటగాడు కోహ్లిలా ఒకే జట్టుకు ఆడింది లేదు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రోహిత్ సారధ్యంలోని టీమిండియా.. వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా జరిగిన వన్డే సిరీస్‌ను రోహిత్ సేన..3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ రేపటి(ఫిబ్రవరి 16) నుంచి ప్రారంభం కానుంది.
చదవండి IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్‌రైజర్స్ కోచ్
Comments
Please login to add a commentAdd a comment