ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ఇండోర్ వేదికగా జరగనున్న మూడో టెస్టుకు స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తల్లి అనారోగ్యం కారణంగా ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లిపోయిన పాట్ కమిన్స్ తిరిగి రాకపోవడంతో స్మిత్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. నాలుగో టెస్టుకు కూడా స్మిత్ జట్టును నడిపించే అవకాశం ఉంది. అయితే బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత కెప్టెన్సీ కోల్పోయిన స్మిత్‌కు నాయకుడిగా మంచి రికార్డుంది.
దీంతో మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు మంచి విజయాలు అందుకుంది. తాజాగా కమిన్స్ గైర్హాజరులో జట్టును నడిపించనున్న స్మిత్ మూడో టెస్టుకు ముందు కెప్టెన్ హోదాలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా టీమిండియా స్పిన్ అస్ర్తాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నాడు.
''నేను నా కెరీర్‌లో 95 టెస్టు మ్యాచులు ఆడాను. అయితే నా కెరీర్‌లో ఎప్పుడూ కూడా ఛీ... ఇలా అవుట్ అయ్యా ఏంటి? అని ఫీల్ అవ్వలేదు. ఢిల్లీ టెస్టులో నేన అవుటైన విధానం నాకే నచ్చలేదు. నా కెరీర్‌లో ఎప్పుడూ నాపై నాకు ఇంత కోపం రాలేదు. నేను ఎలా ఆడాలనుకున్నానో అలా ఆడలేకపోయాను. మొదటి రెండు టెస్టుల్లో కాస్త కంగారు పడ్డాను. మూడో టెస్టుకి ముందు చాలా సమయం దొరికింది. కంగారు లేకుండా నెమ్మదిగా ఆడాలని టీమ్‌కి చెప్పాను.
మా టీమ్‌లో క్రీజులో కుదురుకుపోయి, బౌలర్లకు విసుగు తెప్పించే బ్యాటర్లు ఉన్నారు. అయితే తొలి రెండు టెస్టుల్లో కాస్త తొందరపడ్డాం. దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తా. ఎందుకంటే అంత తేలికైన విషయం కాదు.అశ్విన్, జడేజా వారి దేశంలో అసాధారణంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇది వారి అడ్డా. అయితే ఈసారి ఓపికగా మరింత సమయం తీసుకోవడమపైనే ఫోకస్ పెట్టా. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు క్రీజులో ఎంత ఎక్కువ సేపు ఉంటే అంత మంచిది.
భారత్‌లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. చాలాసార్లు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వికెట్ పడిపోతుంది. చాలా తక్కువ సార్లు మాత్రమే మంచి బాల్‌కి అవుట్ అవుతాం. దాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు.
కాగా స్మిత్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో టీమిండియా అభిమానులు ట్రోల్స్ చేశారు. ''కెప్టెన్ కాగానే పాత స్మిత్‌లా మారిపోయాడు''.. ''అన్ని సరిచేస్తా అంటున్నావు.. ముందు అశ్విన్ బౌలింగ్‌లో ఎలా ఔటవ్వకుండా ఉండాలో ఆలోచించు''.. ''నీకంత సీన్ లేదు'' అంటూ పేర్కొన్నారు. ఇక స్మిత్ తన కెరీర్‌లో 94 టెస్టుల్లో 8718 పరుగులు, 139 వన్డేల్లో 4917 పరుగులు, 63 టి20ల్లో 1008 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment