విరాట్ కోహ్లి- పుజారా(ఫైల్ ఫొటో- PC: BCCI)
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయంపై భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. ఈ సిరీస్‌కు జట్టు ఎంపిక చేసిన విధానం అస్సలు బాగోలేదంటూ పెదవి విరిచాడు. విదేశీ గడ్డపై రాణించగల సత్తా ఉన్న ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాలను పక్కన పెట్టి తప్పుచేశారని విమర్శించాడు.
కాగా సఫారీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయం నమోదు చేయాలన్న రోహిత్ సేనకు ఆదిలోనే చుక్కెదురైన విషయం తెలిసిందే. బాక్సింగ్ డే మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది.
దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడటంతో పాటు సిరీస్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో.. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఫలితంపై స్పందించిన భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జట్టు కూర్పుపై విమర్శలు గుప్పించాడు.
తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అజింక్య రహానేను సెలక్ట్ చేయలేదు. ఏ కారణం లేకుండానే ఛతేశ్వర్ పుజారాను తప్పించారు. వీరిద్దరు ఎలాంటి పిచ్‌లపైనైనా పరుగులు రాబట్టగల సమర్థులు.
పుజారా రికార్డులు గమనిస్తే.. కోహ్లి మాదిరే జట్టు కోసం అతడు ఎంతో కష్టపడ్డాడు. అయినా.. అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో నాకైతే అర్థం కావడం లేదు. నిజానికి టెస్టు క్రికెట్‌లో పుజారా కంటే అత్యుత్తమమైన బ్యాటర్ మనకూ ఎవరూ లేరు.
అతడు నెమ్మదిగా ఆడతాడన్నది వాస్తవం.. అయితే, మ్యాచ్ చేజారిపోకుండా కాపాడగలుగుతాడు. కేవలం అతడి కారణంగానే టీమిండియా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో టెస్టు మ్యాచ్‌లు గెలిచిన సందర్భాలు ఉన్నాయి.
మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక్కసారి కూడా ఆకట్టుకోలేకపోయింది. టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ సెంచరీ వల్లే ఈమాత్రం సాధ్యమైంది.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో మరీ 131 పరుగులే చేసింది. ఒకవేళ కోహ్లి కాంట్రిబ్యూషన్ గనుక లేకపోయి ఉంటే పరిస్థితి మరింత దిగజారేది. నిజానికి ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లోనే టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైపోయింది’’ అంటూ భజ్జీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
కాగా సౌతాఫ్రికాతో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రాహుల్ 101 పరుగులు చేయగా.. కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో 76 రన్స్ తీశాడు. ఇక ఇరు జట్ల మధ్య జనవరి 3 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: Ind A Vs SA A: ఐదు వికెట్లు తీసిన ఆవేశ్.. తిలక్, అక్షర్ అర్ధ శతకాలు! టాప్ స్కోరర్ అతడే
Comments
Please login to add a commentAdd a comment