సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై సీబీఐ దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. క్రికెట్‌లో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటోందని వ్యాఖ్యానించింది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్, ఎథిక్స్ అధికారిగా జస్టిస్ దీపక్ వర్మను నియమించాలని అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు పక్కన పెట్టడంతో హెచ్‌సీఏ, బడ్డింగ్‌స్టార్ క్రికెట్ క్లబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై గురువారం జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
విచారణ సందర్భంగా హెచ్‌సీఏ వ్యవహారాలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ కొంత మంది మంచి వ్యక్తుల్ని నియమిస్తాం. విచారణకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులను నియమిస్తాం. హెచ్‌సీఏలోని రెండు గ్రూపులు మేనేజ్‌మెంట్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. సీబీఐ దర్యాప్తు అవసరం. న్యాయవ్యవస్థను కూడా లాగాలని వారు చూస్తున్నారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘జస్టిస్ వర్మను ఎలాంటి ఆర్డర్ ఇవ్వొద్దని తెలపండి. ఆయన పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. బుధవారానికి విచారణ వాయిదా వేస్తాం. ఈ లోగా విచారణ నిమిత్తం కొందరు విశ్రాంత న్యాయమూర్తుల పేర్లు పరిశీలిస్తాం’’ అని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment