న్యూఢిల్లీ: క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు సృష్టించి పరుగుల యంత్రంగా గుర్తింపు పొందాడు. అటు కెప్టెన్‌గానూ కోహ్లికి మంచి రికార్డే ఉన్నా... ఇంతవరకు ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా సాధించలేకపోయాడనే లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. టెస్టు క్రికెట్‌లో భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందించిన కోహ్లి సారథ్యంలోని జట్టు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంటుందని అభిమానులు భావించినా చివరకు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో కోహ్లి కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ కామెంట్లు వినిపించాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి గొప్ప కెప్టెన్ అని, ఐసీసీ ట్రోఫీ గెలిచేందుకు ఇంకాస్త సమయం పడుతుందన్నాడు. ‘‘సారథిగా తన సత్తా ఏంటో రికార్డులే చెబుతాయి. నాకు తెలిసి ఈ ప్రపంచంలో తనే నెంబర్ 1 బ్యాట్స్‌మెన్. చాలా మంది ఐసీసీ టైటిల్ గురించి మాట్లాడుతున్నారు.. కానీ అతడు ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలవలేదు. నిజం చెప్పాలంటే.. వెనువెంటనే కోహ్లి సేన మూడు మేజర్ టోర్నీలు ఆడింది. ఫైనల్ చేరింది. కానీ తుదిపోరులో తృటిలో విజయం చేజారింది.
అయినా, ప్రతిసారీ ఇలా ఫైనల్ వరకు చేరడం అంత సులభమేమీ కాదు. కోహ్లికి ఇంకాస్త సమయం ఇవ్వాలి’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక కొంతమంది నెటిజన్లు టీమిండియాను చోకర్స్ అని పిలవడం పట్ల స్పందిస్తూ.. ‘‘మేం చోకర్స్ కాదు. 1983 వన్డే వరల్డ్ కప్, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచాం. ప్రతీ విజయం వెనుక ఆటగాళ్ల కఠిన శ్రమ ఉంటుంది. చోకర్స్ అని పిలవడం సరికాదు’’ అని రైనా పేర్కొన్నాడు. ఇక 2014లో టెస్టు, 2017లో పరిమిత ఓవర్ల క్రికెట్ పగ్గాలను కోహ్లి చేపట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌కు సారథ్యం వహిస్తున్న అతడు... ఇంతవరకు ఒక్కసారి టైటిల్ సాధించలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment