నాటింగ్‌హామ్: ఆఖరి పోరులో ఇంగ్లండ్ చెమటోడ్చి పరువు నిలబెట్టుకుంది. మూడో టి20లో సూర్య కుమార్ యాదవ్ (55 బంతుల్లో 117; 14 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులకు సరైన సహకారం లేక భారత్ 17 పరుగులతో ఓడింది. సిరీస్‌ను 2–1తో సరిపెట్టుకుంది. మొదట ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ (39 బంతుల్లో 77; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), లివింగ్‌స్టోన్ (29 బంతుల్లో 42 నాటౌట్; 4 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 198 పరుగులు చేసింది.
శ్రేయస్ అయ్యర్ (28; 2 సిక్స్‌లు)లాంటి మరో స్కోరు ఉంటే భారతే గెలిచేది. ఎందుకంటే మిగతా వారిలో ఇద్దరు మినహా అంతా సింగిల్ డిజిట్‌కే అవుటయ్యారు. ఇంగ్లండ్ పేసర్ రీస్ టోప్లే (3/22) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకోగా... భువనేశ్వర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం లభించింది. సిరీస్ చేజిక్కడంతో హార్దిక్, భువనేశ్వర్, చహల్, బుమ్రా స్థానాల్లో అయ్యర్, ఉమ్రాన్, అవేశ్, బిష్ణోయ్‌లను తీసుకున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో రేపు తొలి వన్డే జరుగుతుంది.
మలాన్, లివింగ్‌స్టోన్ మెరుపులు
ఓపెనర్లు బట్లర్ (9 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ రాయ్ (27; 1 ఫోర్, 2 సిక్స్‌లు) వేగంగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యారు. హర్షల్ తన తొలి ఓవర్లో (ఇన్నింగ్స్ 6వ) అప్పుడే వచ్చిన మలాన్‌ను అవుట్ చేసే అవకాశాన్ని (రిటర్న్‌క్యాచ్) జారవిడిచాడు. అప్పుడు అతని స్కోరు 4 పరుగులే! ఆ తర్వాత మలాన్ అనుభవం లేని బౌలింగ్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లవింగ్‌స్టోన్‌తో కలిసి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. ఐదో వికెట్‌కు 84 పరుగులు జోడించాక బిష్ణోయ్ బౌలింగ్‌లో మలాన్ నిష్క్రమించాడు. ఆఖర్లో లివింగ్‌స్టోన్, బ్రూక్ (9 బంతుల్లో 19; 3 ఫోర్లు) ధాటిగా ఆడటంతో ఇంగ్లండ్ 200 మార్కును దాటేసింది.
సూపర్ సూర్య...
భారత టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ (11), పంత్ (1), కోహ్లి (11) పేలవంగా ఆడారు. 31/3 స్కోరుతో టీమిండియా డీలాపడిన దశలో సూర్య... శ్రేయస్ అండతో వీరోచిత పోరాటం చేశాడు. ఇద్దరు నాలుగో వికెట్‌కు 119 పరుగులు జోడించారు. విల్లే, జోర్డాన్, లివింగ్‌స్టోన్ ఎవరు బౌలింగ్‌కు దిగినా తన దూకుడు కొనసాగించాడు. 32 బంతుల్లో (7 ఫోర్లు, 1 సిక్స్)తో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న సూర్య మరో 50 పరుగుల్ని (48 బంతుల్లో సెంచరీ) కేవలం 16 బంతుల్లోనే చేశాడు. భారీ సిక్సర్లతో ఇంగ్లండ్ శిబిరాన్ని వణికించాడు. అయితే అవతలి వైపు ధాటిగా ఆడగలిగే దినేశ్ కార్తీక్ (6), జడేజా (7) వికెట్లను పారేసుకోవడంతో ఒత్తిడంతా సూర్యమీదే పడింది. షాట్లు కొట్టే ప్రయత్నంలో 19వ ఓవర్లో అతను అవుటై నిష్క్రమిస్తుంటే స్టేడియం మొత్తం కరతాళధ్వనులతో జేజేలు పలికింది. భారత్ గెలుపునకు దూరమైంది.
స్కోరు వివరాలు:
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) పంత్ (బి) ఉమ్రాన్ 27; బట్లర్ (బి) అవేశ్ 18; మలాన్ (సి) పంత్ (బి) బిష్ణోయ్ 77; సాల్ట్ (బి) హర్షల్ 8; లివింగ్‌స్టోన్ (నాటౌట్) 42; అలీ (సి) హర్షల్ (బి) బిష్ణోయ్ 0; బ్రూక్ (సి) బిష్ణోయ్ (బి) హర్షల్ 19; జోర్డాన్ (రనౌట్) 11; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–31, 2–61, 3–84, 4–168, 5–169, 6–197, 7–215. బౌలింగ్: అవేశ్ ఖాన్ 4–0–43–1, ఉమ్రాన్ 4–0–56–1, రవి బిష్ణోయ్ 4–0–30–2, జడేజా 4–0–45–0, హర్షల్ 4–0–35–2.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సాల్ట్ (బి) టోప్లే 11; పంత్ (సి) బట్లర్ (బి) టోప్లే 1; కోహ్లి (సి) రాయ్ (బి) విల్లే 11; సూర్యకుమార్ (సి) సాల్ట్ (బి) అలీ 117; అయ్యర్ (సి) బట్లర్ (బి) టోప్లే 28; కార్తీక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) విల్లే 6; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) గ్లీసన్ 7; హర్షల్ (సి) గ్లీసన్ (బి) జోర్డాన్ 5; అవేశ్ నాటౌట్ 1; బిష్ణోయ్ (బి) జోర్డాన్ 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం 20 ఓవర్లలో 9 వికెట్లకు 198. వికెట్ల పతనం: 1–2, 2–13, 3–31, 4–150, 5–166, 6–173, 7–191, 8–196, 9–198. బౌలింగ్: డేవిడ్ విల్లే 4–0–40–2, టోప్లే 4–0–22–3, గ్లీసన్ 4–0–31–1, క్రిస్ జోర్డాన్ 4–0–37–2, లివింగ్‌స్టోన్ 2–0– 36–0, మొయిన్ అలీ 2–0–31–1.
Comments
Please login to add a commentAdd a comment