
టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్.. సుమారు గత రెండేళ్లుగా టీ20 ఫార్మాట్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత జట్టు కెప్టెన్‌గానూ వ్యవహరించి పలు సిరీస్‌లు గెలిచాడు కూడా!
అయితే, టీ20 ప్రపంచకప్-2024లో మాత్రం అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడు ఈ ముంబైకర్. అమెరికా వేదికగా జరిగిన లీగ్ దశలో మూడు మ్యాచ్‌లలో కలిపి సూర్యకుమార్ యాదవ్ కేవలం 59 పరుగులు చేశాడు.
తొలుత ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో రెండు పరుగులకే నిష్క్రమించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. పాకిస్తాన్‌పై ఏడు పరుగులకే పరిమితమయ్యాడు. దీంతో సూర్య బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలో అమెరికాతో మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించిన స్కై.. 49 బంతుల్లో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. జట్టును గెలిపించి సూపర్-8కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ వేదికగా తదుపరి దశకు సిద్ధమవుతున్న వేళ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో ముచ్చటించాడు.
ఈ సందర్భంగా తనపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ‘‘రెండేళ్లుగా వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉండి.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయగలుగుతూ.. వికెట్‌కు అనుగుణంగా తనను తాను మలచుకోగల ఆటగాడు.. బ్యాట్స్‌మన్‌షిప్ చూపగలడు.
నేను కూడా అదే ట్రై చేస్తున్నా. ఒక్కోసారి ప్రత్యర్థి జట్టు బౌలర్లు మన గేమ్‌ను రీడ్ చేస్తూ.. అద్భుతంగా బౌలింగ్ చేయగా.. పిచ్ కూడా వారికి అనుకూలిస్తే మనమేమీ చేయలేకపోవచ్చు.
అలాంటపుడు మనం మరింత జాగ్రత్తగా.. తెలివిగా ఆడాలి. అయినప్పటికీ ఇన్నింగ్స్ పొడిగించుకునే అవకాశం దొరకకపోవచ్చు. పరిస్థితికి తగ్గట్లుగా మనం మారిపోవాలి.
అంతేకాదు.. అపుడు మనతో పాటు క్రీజులో ఉన్న భాగస్వామితోనూ సరైన సమన్వయం ఉండాలి. పరస్పర అవగాహనతో పరుగులు రాబట్టడమే ధ్యేయంగా ముందుకు సాగాలి.
నిజానికి న్యూయార్క్‌లో ఇదే తొలిసారి ఆడటం. అక్కడి పిచ్ కాస్త భిన్నంగా ఉంది. బ్యాటర్లకు సవాలుగా పరిణమించింది. అయితే, వెస్టిండీస్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు తెలుసు.
అక్కడ ఆడిన అనుభవం ఉంది. న్యూయార్క్ కంటే ఇక్కడ మెరుగ్గానే బ్యాటింగ్ చేస్తామనే నమ్మకం ఉంది’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.
సూపర్-8 దశలో తప్పకుండా బ్యాట్ ఝులిపిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. కాగా గ్రూప్-1లో ఉన్న టీమిండియా జూన్ 20న అఫ్గనిస్తాన్‌తో సూపర్-8లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment