ముప్పై ఏళ్ల వయసులో టీమిండియాలో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్.. అనతికాలంలోనే ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా ఎదిగాడు. అంతేకాదు.. ఊహించని రీతిలో భారత టీ20 జట్టు కెప్టెన్‌గానూ నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ వారసుడిగా.. పూర్తిస్థాయి కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే విజయం అందుకున్నాడు ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.
గొప్ప ఆప్షన్లు లేవు కాబట్టే
అయితే, సూర్య పదవి తాత్కాలికమే అంటున్నాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా బీసీసీఐ అతడిని ఎంచుకోలేదని అభిప్రాయపడ్డాడు. కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు ఇప్పటికిప్పుడు గొప్ప ఆప్షన్లు లేవు కాబట్టే.. సూర్య వైపు మొగ్గుచూపారని పేర్కొన్నాడు. సీనియర్లు రిటైర్ కావడం, హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సమస్యలు సూర్యను కెప్టెన్‌గా నియమించడానికి దోహదం చేశాయని స్టైరిస్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
రెండేళ్లపాటు మాత్రమే
ఏడాది లేదంటే రెండేళ్లపాటు మాత్రమే సూర్యకుమార్ యాదవ్ టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఉంటాడని స్టైరిస్ అంచనా వేశాడు. అతడి స్థానంలో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ భారత జట్టు పగ్గాలు చేపడతాడని.. అతడిని పూర్తిస్థాయి సారథిగా తీర్చిదిద్దేందుకే సూర్య డిప్యూటీగా నియమించారని పేర్కొన్నాడు. గంభీర్‌కు- భవిష్య కెప్టెన్‌కు మధ్య సూర్య కేవలం ఓ వారథి లాంటివాడు మాత్రమే అని స్టైరిస్ చెప్పుకొచ్చాడు.
పదేళ్ల పాటు అతడే
టీమిండియా భవిష్య కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాత్రమే అని.. 24 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతాడని స్కాట్ స్టైరిస్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఇప్పుడే భారత జట్టు పగ్గాలు చేపట్టేందుకు తగిన అనుభవం అతడికి లేదని.. అందుకే సూర్య రూపంలో తాత్కాలిక ఏర్పాటు చేశారని పేర్కొన్నాడు. ఒకవేళ సూర్య ద్వైపాక్షిక సిరీస్‌లలో టీమిండియాను విజయవంతంగా ముందుకు నడిపిస్తే.. టీ20 ప్రపంచకప్-2026 వరకు అతడే సారథిగా కొనసాగుతాడని స్టైరిస్ అంచనా వేశాడు.
భారత క్రికెట్‌ను ఏలుతాడు
శుబ్‌మన్ గిల్ రోజురోజుకు తన ఆటను మెరుగుపరచుకుంటున్నాడని.. అయితే, మూడు ఫార్మాట్లలో నిలకడగా ఆడటం ముఖ్యమని స్టైరిస్ పేర్కొన్నాడు. అలా అయితేనే, వరుస అవకాశాలు దక్కించుకుని కెప్టెన్ రేసులో ముందుంటాడని అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరని.. అయితే, తన దృష్టిలో మాత్రం రానున్న దశాబ్దంలో గిల్ భారత క్రికెట్‌ను ఏలుతాడని స్కాట్ స్టైరిస్ పేర్కొన్నాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
ఇద్దరూ విజయవంతంగా
కాగా రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో 33 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ తొలిసారిగా భారత టీ20 జట్టుకు సారథ్యం వహించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై, సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియాను విజేతగా నిలిపాడు. తాజాగా రెగ్యులర్ కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే శ్రీలంక టూర్‌లో భారత్‌కు 2-0తో సిరీస్‌ను అందించాడు. మరోవైపు.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టుకు శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించాడు. 4-1తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ గెలిచాడు.
చదవండి: ‘ద్రవిడ్ వల్లే కాలేదు.. ఇక్కడ నేనే బాస్ అంటే కుదరదు’
Comments
Please login to add a commentAdd a comment