
రాజ్‌కోట్: బ్యాటర్ల వైఫల్యంతో దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో పరాజయం మూటగట్టుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 24 పరుగుల తేడాతో రాజస్తాన్ చేతిలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
కార్తీక్ శర్మ (27 బంతుల్లో 58; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకోగా... దీపక్ హుడా (46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 97 పరుగుల జోడించడంతో రాజస్తాన్ జట్టు మంచి స్కోరు చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ, అనికేత్ రెడ్డి చెరో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులకే పరిమితమైంది. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో విజృంభించిన హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ (13) ఈసారి విఫలం కాగా... తన్మయ్ అగర్వాల్ (33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తనయ్ త్యాగరాజన్ (32 నాటౌట్; 3 ఫోర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది.
రాజస్తాన్ బౌలర్లలో మానవ్ సుతార్, అనికేత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తాజా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం, రెండు పరాజయాలు ఖాతాలో వేసుకున్న హైదరాబాద్ జట్టు 4 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో రేపు బిహార్‌తో హైదరాబాద్ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment