తిలక్‌ వర్మ విధ్వంసకర సెంచరీ.. టీ20 ఫార్మాట్లోనే తొలి బ్యాటర్‌గా.. వరల్డ్‌ రికార్డు! | SMAT: Tilak Varma Becomes 1st batter Hit 3 Consecutive T20 Tons 67 Ball 151 | Sakshi
Sakshi News home page

తిలక్‌ వర్మ విధ్వంసకర సెంచరీ.. 14 ఫోర్లు, 10 సిక్స్‌లు! ఊచకోత అన్నా సరిపోదు

Published Sat, Nov 23 2024 3:47 PM | Last Updated on Sat, Nov 23 2024 4:44 PM

SMAT: Tilak Varma Becomes 1st batter Hit 3 Consecutive T20 Tons 67 Ball 151

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో వరుసగా మూడు శతకాలు బాదిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. కాగా అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున వెలుగులోకి వచ్చిన ఈ హైదరాబాదీ.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు.

ముంబై తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన తిలక్‌ వర్మ.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే గతేడాది భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 20 టీ20లు, 4 వన్డేలు ఆడిన తిలక్‌ వర్మ ఆయా ఫార్మాట్లలో 68, 616 పరుగులు చేశాడు.

సౌతాఫ్రికా గడ్డపై వరుసగా రెండు శతకాలు
ఇక అంతర్జాతీయ టీ20లలో తిలక్‌ వర్మకు ఇటీవలే రెండు సెంచరీలు బాదడం విశేషం. ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై ఈ ఘనత సాధించాడు. తాజాగా అతడు దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌ తరఫున బరిలోకి దిగాడు.

ఫోర్లు, సిక్సర్ల వర్షం 
ఇక్కడా.. తిలక్‌ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 51 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు.  మేఘాలయతో మ్యాచ్‌లో ఫోర్లు(14), సిక్సర్ల(10) వర్షం కురిపిస్తూ పరుగుల విధ్వంసం సృష్టించాడు. కేవలం 67 బంతుల్లోనే 151 పరుగులతో దుమ్ములేపి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి హైదరాబాద్‌కు 248 పరుగులు భారీ స్కోరు అందించాడు.

సహచర బ్యాటర్‌ తన్మయ్‌ అగర్వాల్‌(55)తో కలిసి 122 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో పాటు.. రాహుల్‌ బుద్ధి(30)తో కలిపి 84 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ నెలకొల్పాడు. రాజ్‌కోట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన మేఘాలయ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది.

సుడిగాలి ఇన్నింగ్స్‌లో ఆఖరి వరకు అజేయంగా
ఓపెనర్‌ రాహుల్‌ సింగ్‌ డకౌట్‌ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్‌ తన్మయ్‌ సహకారం అందించగా కెప్టెన్‌ తిలక్‌ వర్మ ఈ మేర సుడిగాలి ఇన్నింగ్స్‌లో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌ కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 248 రన్స్‌ చేసింది.

హైదరాబాద్‌ భారీ విజయం
ఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన మేఘాలయ హైదరాబాద్‌ బౌలర్ల ధాటికి 69 పరుగులకే కుప్పకూలింది. 15.1 ఓవర్లలోనే ఆలౌట్‌ అయింది. దీంతో హైదరాబాద్‌ ఏకంగా 179 పరుగులతో భారీ విజయం సాధించింది. ఇక హైదరాబాద్‌ బౌలర్లలో అనికేత్‌ రెడ్డి నాలుగు, తనయ్‌ త్యాగరాజన్‌ మూడు, మికిల్‌ జైస్వాల్‌, సరణు నిషాంత్‌, తెలకపల్లి రవితేజ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

చదవండి: Ind vs Aus 1st Test: ఎవరు అవుట్‌?.. రాహుల్‌ ద్రవిడ్‌ మనసంతా ఇక్కడే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement