Ind vs Aus 1st Test: రాహుల్‌ ద్రవిడ్‌ మనసంతా ఇక్కడే..! | Who Is Out: Dravid Cant Keep Calm Halts RR IPL Auction Meet For Ind vs Aus Test | Sakshi
Sakshi News home page

Ind vs Aus 1st Test: ఎవరు అవుట్‌?.. రాహుల్‌ ద్రవిడ్‌ మనసంతా ఇక్కడే..!

Published Sat, Nov 23 2024 2:03 PM | Last Updated on Sat, Nov 23 2024 2:45 PM

Who Is Out: Dravid Cant Keep Calm Halts RR IPL Auction Meet For Ind vs Aus Test

టీమిండియా హెడ్‌కోచ్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌. రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేస్తూ ప్రధాన కోచ్‌గా వచ్చిన ఈ కర్ణాటక దిగ్గజం.. తన హయాంలో భారత జట్టును అన్ని ఫార్మాట్లలోనూ అగ్రపథంలో నిలిపాడు.  

ద్రవిడ్‌ మార్గదర్శనంలో టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23లో ఫైనల్‌ చేరడంతో పాటు.. వన్డే వరల్డ్‌కప్‌-2023లోనూ టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. అయితే, ఈ రెండు సందర్భాల్లో తుదిమెట్టుపై బోల్తా పడి విజయానికి ఒక అడుగుదూరంలోనే నిలిచిపోయింది.

అద్భుత విజయంతో ముగింపు
అలాంటి సమయంలో ద్రవిడ్‌పై విమర్శలు రాగా.. టీ20 ప్రపంచకప్‌-2024 రూపంలో గట్టి సమాధానమిచ్చే అవకాశం అతడికి దొరికింది. ఆటగాళ్ల ప్రాక్టీస్‌, క్రమశిక్షణ విషయంలో నిక్కచ్చిగా ఉండే ద్రవిడ్‌.. ఈసారి ఆఖరి గండాన్ని దాటేసి.. కోచ్‌గా అద్భుత విజయంతో తన ప్రయాణం ముగించాడు. ఈ మెగా టోర్నీలో రోహిత్‌ సేన టైటిల్‌ సాధించడంతో కోచ్‌గా తన జర్నీని సంపూర్ణం చేసుకున్నాడు.

ఇక గంభీర్‌ వంతు
ఇక ఈ ఐసీసీ ఈవెంట్‌ తర్వాత ద్రవిడ్‌ స్థానంలో గౌతం గంభీర్‌ టీమిండియా హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు. అతడి నేతృత్వంలో టీమిండియా మిశ్రమ ఫలితాలు పొందుతోంది. అయితే, ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో టీమిండియా వైట్‌వాష్‌ కావడంతో గంభీర్‌పై విమర్శలు వచ్చాయి.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భారత జట్టు ప్రదర్శనపైనే గౌతీ భవిష్యత్తు ఆధారపడి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మెగా సిరీస్‌లో భాగంగా భారత్‌ ఆసీస్‌ టూర్‌లో ఐదు టెస్టులు ఆడనుంది. ఇందులో కనీసం నాలుగు గెలిస్తేనే ఈసారి భారత్‌ పరపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుతుంది.

పెర్త్‌ టెస్టుపై ద్రవిడ్‌ ఆసక్తి
ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ పెర్త్‌ వేదికగా శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గైర్హాజరీలో పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా ఈ మ్యాచ్‌లో టీమిండియాకు సారథ్యం వహిస్తున్నాడు. పెర్త్‌లో టాస్‌ గెలిచిన అతడు... తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్‌ అయింది.

అయితే, బ్యాటింగ్‌లో కుప్పకూలినా.. బౌలింగ్‌లో మాత్రం భళా అనిపించింది. తొలి రోజు ఆటలో ఆసీస్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. భారత పేసర్ల దెబ్బకు శుక్రవారం ఆసీస్‌ కేవలం 67 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.

ఇక ఈ మ్యాచ్‌ సాధారణ అభిమానులతో పాటు ద్రవిడ్‌లోనూ ఆసక్తి రేపింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఎన్ని వికెట్లు పడ్డాయి? ఎవరు అవుటయ్యారంటూ ద్రవిడ్‌ ఆరా తీసిన వీడియో వైరల్‌గా మారింది. కాగా ద్రవిడ్‌ ప్రస్తుతం ఐపీఎల్‌-2025 మెగా వేలంతో బిజీగా ఉన్నాడు.

అవుటైంది ఎవరు? ఎవరి బౌలింగ్‌లో?
అయినప్పటికీ అతడి మనసు టీమిండియా- ఆసీస్‌ మ్యాచ్‌పై ఉండటం విశేషం. ఆసీస్‌ 47 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన రాజస్తాన్‌ రాయల్స్‌ సభ్యుడు ఒకరు స్కోరు చెప్తుండగా.. ద్రవిడ్‌ ఎవరు అవుటయ్యారంటూ ఉత్సాహంగా అడిగాడు. రాజస్తాన్ ఫ్రాంఛైజీ ఇందుకు సంబంధించిన వీడియోను తమ సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసింది. 

ఇదిలా ఉంటే.. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా భారత్‌ ఆసీస్‌ను కేవలం 104 పరుగులకే ఆలౌట్‌ చేసింది. బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. హర్షిత్‌ రాణా మూడు, మహ్మద్‌ సిరాజ్‌ రెండు వికెట్లు దక్కించుకున్నారు.

కాగా ద్రవిడ్‌ ఇటీవలే రాజస్తాన్‌ రాయల్స్‌ హెడ్‌కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. ఇక మెగా వేలం కోసం అతడు ఇప్పటికే సౌదీ అరేబియాలోని జెద్దా నగరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట జరుగనుంది.

చదవండి: ఇది నా డ్రీమ్ ఇన్నింగ్స్ కాదు.. అతడే నా ఆరాధ్య దైవం: నితీశ్‌ రెడ్డి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement