T20 Blast 2023: Jos Buttler Completes 10,000 Runs in T20 - Sakshi
Sakshi News home page

టీ20ల్లో బట్లర్‌ జమానా.. ఉతికి ఆరేస్తున్న ఇంగ్లండ్‌ కెప్టెన్‌, అత్యంత అరుదైన జాబితాలో చోటు

Published Sat, Jun 24 2023 3:53 PM | Last Updated on Sat, Jun 24 2023 6:06 PM

T20 Blast 2023: Jos Buttler Completes 10000 T20 Runs - Sakshi

టీ20ల్లో ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ జమానా నడుస్తుంది. ఇటీవలకాలంలో పొట్టి ఫార్మాట్‌లో బట్లర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు తాజాగా ఓ అరుదైన క్లబ్‌లో చేరి రికార్డు సృష్టించాడు. టీ20ల్లో 10000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. టీ20 బ్లాస్ట్‌ 2023లో భాగంగా బట్లర్‌ ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు.

డెర్బీషైర్‌తో నిన్న (జూన్‌ 23) జరిగిన మ్యాచ్‌లో లాంకాషైర్‌ తరఫున బరిలోకి దిగిన బట్లర్‌.. 39 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 3 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద బట్లర్‌ 10000 పరుగుల ల్యాండ్‌ మార్క్‌ను రీచ్‌ అయ్యాడు. టీ20 కెరీర్‌లో మొత్తం 372 మ్యాచ్‌లు ఆడిన బట్లర్‌.. 34.16 సగటున, 144.70 స్ట్రయిక్‌ రేట్‌తో 6 శతకాలు, 21 హాఫ్‌ సెంచరీల సాయంతో 10080 పరుగులు చేశాడు. 

టీ20ల్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్న తొమ్మిదో ఆటగాడు..
టీ20 ఫార్మాట్‌లో 10000 పరుగులు సాధించిన తొమ్మిదో ఆటగాడిగా బట్లర్‌ రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో క్రిస్‌ గేల్‌ (14562) అగ్రస్థానంలో ఉండగా.. షోయబ్‌ మాలిక్‌ (12528), కీరన్‌ పోలార్డ్‌ (12175), విరాట్‌ కోహ్లి (11965), డేవిడ్‌ వార్నర్‌ (11695), ఆరోన్‌ ఫించ్‌ (11392), అలెక్స్‌ హేల్స్‌ (11214), రోహిత్‌ శర్మ (11035) వరుసగా 2 నుంచి 8 స్థానాల్లో నిలిచారు. 

ఇంగ్లండ్‌ తరఫున రెండో ఆటగాడు..
టీ20ల్లో ఇంగ్లండ్‌ తరఫున 10000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా బట్లర్‌ రికార్డుల్లోకెక్కాడు. బట్లర్‌కు ముందు అలెక్స్‌ హేల్స్‌ (11214) ఈ ఘనత సాధించాడు. బట్లర్‌ తర్వాత జేమ్స్‌ విన్స్‌ (9343) టీ20ల్లో 10000 పరుగులకు చేరువలో ఉన్నాడు.

రోహిత్‌ శర్మ కంటే వేగంగా..
జోస్‌ బట్లర్‌ టీ20ల్లో రోహిత్‌ శర్మ కంటే వేగంగా 10000 పరుగుల మార్క్‌ను రీచ్‌ అయ్యాడు. రోహిత్‌కు ఈ ఘనత సాధించేందుకు 362 ఇన్నింగ్స్‌లు అవసరమైతే.. బట్లర్‌ కేవలం 350 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. ఓవరాల్‌గా విరాట్‌ కోహ్లి ఈ ఘనతను వేగంగా అధిగమించాడు. విరాట్‌ కేవలం 285 ఇన్నింగ్స్‌ల్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

బట్లర్‌ వీరవిహారంతో లాంకాషైర్‌ ఘన విజయం..
డెర్బీషైర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో బట్లర్‌ వీరవిహారం చేయడంతో లాంకాషైర్‌ 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బట్లర్‌కు జతగా లవింగ్‌స్టోన్‌ (30 బంతుల్లో 47 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు), వెల్స్‌ (4 బంతుల్లో 13; 2 సిక్సర్లు) రాణించడంతో లాంకాషైర్‌ 15 ఓవర్లలో (వర్షం కారణంగా కుదించారు) 4 వికెట్ల నష్టానికి 177 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఛేదనలో తడబడిన డెర్బీషైర్‌ 15 ఓవర్లలో 150 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement