
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మాసాల్లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లు తమ పూర్తి వివరాలను సెప్టెంబర్ 15లోపు ప్రకటించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆయా జట్లకు డెడ్‌లైన్ విధించింది. నిర్ధేశిత గడువులోగా జట్లన్నీ ప్రపంచకప్ బరిలోకి దిగబోయే 15 మంది సభ్యుల వివరాలను సమర్పించాలని సంబంధిత క్రికెట్ బోర్డులను ఐసీసీ ఆదేశించింది. ఐసీసీ నుంచి వెలువడిన ఈ ప్రకటనతో మెగా టోర్నీలో పాల్గొనబోయే జట్లన్నీ అలర్టయ్యాయి. ఆటగాళ్ల ఎంపిక విషయంలో కసరత్తును వేగవంతం చేశాయి.
కాగా, అక్టోబర్ 16న జరిగే క్వాలిఫయర్ మ్యాచ్‌తో టీ20 వరల్డ్ కప్ 2022 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. గ్రూప్ స్టేజ్‌లో నమీబియా, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్, యూఏఈ జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. అనంతరం రెండు గ్రూపుల్లో టాప్ 2లో నిలిచిన జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లతో సూపర్ 12 రౌండ్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి.
సూపర్ 12 రౌండ్ గ్రూప్ 1లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడనుండగా.. గ్రూప్ 2 నుంచి బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్లు తలపడతాయి. ఈ టోర్నీలో టీమిండియా దాయాది పాక్‌తో అక్టోబర్ 23న తలపడనుంది.
చదవండి: T20 WC 2022: పంత్ వైఫల్యం.. డీకే జోరు.. ద్రవిడ్ ఏమన్నాడంటే!