టీ20 ప్రపంచకప్-2021 తర్వాత న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తదితర జట్లతో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లలో అదరగొట్టింది టీమిండియా. పొట్టి ఫార్మాట్‌లో టాప్ ర్యాంకులో కొనసాగుతూ తమకు తిరుగులేదని నిరూపించుకుంది. అయితే, ప్రతిష్టాత్మక ఆసియాకప్-2022 టీ20 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రోహిత్ సేన.. కనీసం ఫైనల్ చేరకుండానే నిష్క్రమించింది.
ఆ తర్వాత స్వదేశంలో మాత్రం అదరగొట్టింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో వరుస సిరీస్‌లు కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో కీలక ఈవెంట్‌కు సిద్ధమైంది. ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్-2022లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. మెల్‌బోర్న్ వేదికగా అక్టోబరు 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో టోర్నీ ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది.
అయితే, ద్వైపాక్షిక సిరీస్‌లలో రాణించినా ఆసియా కప్-2022లో టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదన్న విషయం తెలిసిందే. గతేడాది ప్రపంచకప్‌నకు ముందు కూడా ఇలాంటి పరిస్థితే! దీంతో వరల్డ్‌కప్ ఎనిమిదో ఎడిషన్‌లో ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమోనని అభిమానులు ఆందోళన పడుతున్నారు.
మరోవైపు.. ఇటీవలి కాలంలో బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో బ్యాటర్లు రాణిస్తేనే ఫలితం ఉంటుందని, వారిపైనే ఎక్కువ ఆధారపడాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమర్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తిక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రోహిత్ శర్మ
తొలి టీ20 టోర్నీ నుంచి పొట్టి క్రికెట్ ప్రపంచకప్ ఆడుతున్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. అయితే, ఈ ఎనిమిదో ఎడిషన్ మాత్రం అతడికి మరింత ప్రత్యేకం. ఈసారి కెప్టెన్‌గా కొత్త హోదాలో బరిలోకి దిగబోతున్నాడు.
ఇక ఈ హిట్‌మ్యాన్‌కు టీ20 ఫార్మాట్‌లో ఉన్న రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ టీ20లలో 4 సెంచరీలు బాదిన ఘనత అతడిది. మొత్తంగా ఇప్పటి వరకు 142 మ్యాచ్‌లు ఆడి 3737 పరుగులు చేశాడు.
గతేడాది ప్రపంచకప్ తర్వాత టీమిండియా టీ20 పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ ద్వైపాక్షిక సిరీస్‌లలో ఎదురులేని విజయాలు సాధించాడు. అతడి సారథ్యంలో భారత జట్టు వరుస సిరీస్‌లు గెలిచింది. అయితే, ప్రతిష్టాత్మక ఆసియా టోర్నీలో మాత్రం చతికిల పడింది. ఈ ఈవెంట్‌లో కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ రోహిత్ ఆకట్టుకోలేకపోయాడు.
శ్రీలంకతో మ్యాచ్‌లో 72 పరుగులు సాధించిన హిట్‌మ్యాన్.. మొత్తం కేవలం 133 పరుగులు మాత్రమే చేశాడు. ఇక గత ప్రపంచకప్‌లోనూ తన స్థాయికి తగ్గట్లు రాణించలేదు. ఐదు మ్యాచ్‌లలో కలిపి 174 పరుగులు చేయగలిగాడు ఈ ఓపెనర్.
పవర్‌ప్లేలో దూకుడుగా ఆడే రోహిత్ సక్సెస్ అయితేనే మిడిలార్డర్‌పై పెద్దగా భారం పడదు. తనదైన రోజున విజృంభించే ఈ హిట్‌మ్యాన్.. ప్రతిష్టాత్మక టోర్నీల్లో మాత్రం పెద్దగా రాణించడనే అపవాదు ఉంది. దానిని చెరిపేసేలా బ్యాట్ ఝులిపిస్తేనే కెప్టెన్‌గా తనకు ఈ టోర్నీ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
విరాట్ కోహ్లి
టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి గురించి అతడి రికార్డులే మాట్లాడతాయి. గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడ్డ అతడు.. ఆసియా కప్-2022లో తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ నమోదు చేసి సత్తా చాటాడు. ఇక ఈ ఛేజింగ్ కింగ్‌పై టీమిండియా ఎక్కువగా ఆధారపడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్న కోహ్లి తన పరుగుల దాహం తీర్చుకునేలా మునుపటిలా బ్యాట్‌తో చెలరేగితే టీమిండియాకు తిరుగు ఉండదు. ఒకవేళ అలా జరుగకుండా.. ఈ వన్‌డౌన్ బ్యాటర్ విఫలమైతే మాత్రం భారత జట్టుకు కష్టాలు తప్పవు.
సూర్యకుమార్ యాదవ్
ప్రస్తుతం అత్యద్భుత ఫామ్‌లో ఉన్న టీమిండియా క్రికెటర్ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు సూర్యకుమార్ యాదవ్. లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా తనదైన శైలిలో ఆడుతూ.. రికార్డులు సృష్టిస్తున్నాడు ఈ ముంబై బ్యాటర్. టీ20లో నంబర్ 2గా ఉన్న సూర్య ఇటీవల ఒంటిచేత్తో జట్టును గెలిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే బౌండరీలు, సిక్స్‌ల వర్షం కురిపించడం ఖాయం. అయితే, నాలుగో స్థానంలో అదరగొడుతున్న సూర్యకు ఇంతవరకు ఆస్ట్రేలియా పిచ్‌లపై ఆడిన అనుభవం లేదు. ప్రాక్టీసు మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో మెరిసినా అసలైన పోరులో ఎంతవరకు రాణిస్తాడనేదే ప్రశ్న. ఆసీస్‌లో అతడు కఠిన సవాలు ఎదుర్కోకతప్పదనడంలో సందేహం లేదు.
హార్దిక్ పాండ్యా
ప్రపంచకప్-2021కు ముందు విమర్శల పాలైన హార్దిక్ పాండ్యా.. పూర్తి ఫిట్‌నెస్ సాధించి ఐపీఎల్-2022లో అదరగొట్టాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా అరంగేట్రంలోనే జట్టును గెలిపించి బ్యాటర్‌గానూ ఆకట్టుకున్నాడు ఈ ఆల్‌రౌండర్.
అదే జోష్‌లో టీమిండియా ద్వితీయ శ్రేణి టీ20 జట్టు సారథిగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడం సహా పునరాగమనంలో మెరుగ్గా రాణిస్తున్నాడు. ఆసియా కప్-2022లో పాక్‌తో మ్యాచ్ గెలవడంలో అతడిది కీలక పాత్ర. పేస్ బౌలింగ్ చేయగల హార్దిక్ పాండ్యా మిడిలార్డర్‌లో టీమిండియాకు చక్కటి ఆప్షన్‌గా ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల హార్దిక్ రాణిస్తే భారత జట్టుకు తిరుగుండదు.
దినేశ్ కార్తిక్
ఐపీఎల్-2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగిన టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఫినిషర్‌గా అద్భుత పాత్ర పోషించాడు. తద్వారా జాతీయ జట్టులో పునరాగమనం చేసిన ఈ కామెంటేటర్ .. కుర్ర బ్యాటర్ రిషభ్ పంత్‌కు పోటీనిస్తూ వరుస మ్యాచ్‌లలో జట్టులో చోటు దక్కించుకున్నాడు. విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. దీంతో టీ20 వరల్డ్‌కప్-2022లో అతడిపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆడిన 19 టీ20ల్లో 273 పరుగులు(150కిపైగా స్ట్రైక్‌రేట్) చేసిన డీకే మెగా టోర్నీలో ఎలా ఆడతాడో చూడాలి మరి! ఇలా బ్యాటర్లతో పాటు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ , యువ ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా రాణిస్తేనే టీమిండియా ట్రోఫీని ముద్దాడగలదు!!
-వెబ్‌డెస్క్
చదవండి: West Indies: 'హెట్‌మైర్ శాపం తగిలింది.. అందుకే విండీస్‌కు ఈ దుస్థితి'
T20 World Cup 2022: 'రిజ్వాన్, కోహ్లి, సూర్య కాదు.. అతడే ప్రపంచకప్ టాప్ రన్ స్కోరర్'
Comments
Please login to add a commentAdd a comment