
పాక్‌తో టీమిండియా మ్యాచ్ (ఫైల్ ఫొటో)
T20 World Cup 2022- Semi Finals Predictions: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సహా ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో అద్భుత విజయాలు నమోదు చేస్తున్న రోహిత్ సేనతో పాటు పాకిస్తాన్, ఇంగ్లండ్ ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి.
సౌతాఫ్రికా సైతం గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ సెమీస్ చేరే జట్లను అంచనా వేశాడు. తన ఫేవరెట్ జట్లు మూడు అని.. అయితే, వాటితో పాటు సౌతాఫ్రికాను కూడా తక్కువగా అంచనా వేయలేమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రొటిస్‌ను ‘డార్క్ హార్స్’గా అభివర్ణించాడు ఈ మాజీ ఫాస్ట్ బౌలర్.
ఆ నాలుగు జట్లు సెమీస్‌లో
ఈ మేరకు దుబాయ్‌లో మీడియాతో మాట్లాడిన వసీం అక్రమ్.. ‘‘నా వరకైతే ఆస్ట్రేలియా, ఇండియా, పాకిస్తాన్ సెమీస్‌లో ఉంటాయి. సౌతాఫ్రికా డార్క్ హార్స్(అంచనాలు తలకిందులు చేసి అనూహ్యంగా పుంజుకుంటుందన్న ఉద్దేశంలో) అయ్యే అవకాశం ఉంది’’ అని చెప్పుకొచ్చాడు.
టీమిండియా ఈసారైనా!
కాగా గతేడాది ప్రపంచకప్‌లో సెమీస్ కూడా చేరకుండా నిష్క్రమించిన టీమిండియా ఈసారి మాత్రం హాట్ ఫేవరెట్‌గా మారింది. స్వదేశంలో, విదేశాల్లో వరుసగా టీ20 సిరీస్‌లు గెలిచిన రోహిత్ సేన టాప్ ర్యాంకులో కొనసాగుతోంది. విరాట్ కోహ్లి పూర్వపు ఫామ్ అందుకోవడం సహా సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఆటతీరుకు తోడు హార్దిక్ పాండ్యా రాణించడం వంటి సానుకూల అంశాలు ఎన్నో ఉన్నాయి.
అయితే, ఇటీవల టీమిండియాను బాగా ఇబ్బంది పెడుతున్న అంశం బౌలింగ్. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు దూరం కావడం.. మరో సీనియర్ సీమర్ భువనేశ్వర్ కుమార్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోవడం భారత జట్టును కలవరపెడుతున్నాయి. అయితే, ఈ లోపాలన్నిటినీ సరిదిద్దుకుని ట్రోఫీ ముద్దాడటమే లక్ష్యంగా ముందుకు సాగుతామంటూ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే స్పష్టం చేశాడు.
పాక్ అలా.. ఆసీస్‌కు ఇలా
మరోవైపు.. గత ప్రపంచకప్‌లో సెమీస్ చేరిన పాకిస్తాన్ ఇటీవల ముగిసిన ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో రన్నరప్‌గా నిలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రస్తుతం న్యూజిలాండ్-బంగ్లాదేశ్‌తో ట్రై సిరీస్ ఆడుతున్న బాబర్ ఆజం బృందం అక్టోబరు 23న టీమిండియాతో మ్యాచ్‌తో వరల్డ్‌కప్ టోర్నీలో ప్రయాణం ఆరంభించనుంది.
ఇక డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు.. స్వదేశంలో ఈ ఐసీసీ ఈవెంట్ జరుగనుండటం అదనపు బలంగా మారిందనడంలో సందేహం లేదు. దక్షిణాఫ్రికా విషయానికొస్తే.. ఇటీవలి కాలంలో.. కెప్టెన్ తెంబా బవుమా వైఫల్యం జట్టుకు భారంగా మారింది. మెగా టోర్నీకి ముందు భారత్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో ఓటమి జట్టును తీవ్రంగా నిరాశపరిచింది.
చదవండి: Syed Mushtaq Ali Trophy: అంబటి రాయుడు, షెల్డన్ జాక్సన్ వాగ్వాదం.. వీడియో వైరల్
BCCI Next Boss Roger Binny: అధ్యక్షుడిగా రోజర్ బిన్నీనే ఎందుకు?.. ఆసక్తికర విషయాలు
Comments
Please login to add a commentAdd a comment