టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్-బిలో ఉన్న కంగారూ జట్టు ఇప్పటికే రెండు విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఒమన్‌ను ఓడించిన మార్ష్ బృందం.. మరుసటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 36 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
తాజాగా బుధవారం(భారత కాలమానం ప్రకారం) నాటి మ్యాచ్‌లో నమీబియాను మట్టికరిపించింది. తద్వారా గ్రూప్-బి టాపర్‌గా నిలిచి.. సూపర్-8కు అర్హత సాధించింది ఆస్ట్రేలియా.
వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా వేదికగా నమీబియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, కంగారూ జట్టు బౌలర్ల ధాటికి నమీబియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది.
జోష్ హాజిల్‌వుడ్ దెబ్బకు ఓపెనర్లు మైకేల్ వాన్ లింగెన్ 10, నికో డెవిన్ 2 పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్ బ్యాటర్ జాన్ ఫ్రిలింక్(1) ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
ఈ క్రమంలో గెర్హార్డ్ ఎరాస్మస్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 43 బంతుల్లో 36 పరుగులతో ఉన్న అతడిని మార్కస్ స్టొయినిస్ అవుట్ చేయడంతో నమీబియా బ్యాటింగ్ ఆర్డర్ పతనం తారస్థాయికి చేరింది.
తర్వాతి స్థానాల్లో వచ్చిన ఆటగాళ్లు వరుసగా 3, 1, 1, 7, 0, 2(నాటౌట్), 0 పరుగులు మాత్రమే చేశారు. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో 17 ఓవర్లలో కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయింది నమీబియా.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా ఒక వికెట్ మాత్రమే కోల్పోయి పని పూర్తి చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 8 బంతుల్లోనే 20 పరుగులతో దుమ్ములేపాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 17 బంతుల్లో 34, కెప్టెన్ మిచెల్ మార్ష్ 9 బంతుల్లో 18 రన్స్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.
ఈ క్రమంలో 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్.. నమీబియాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసి.. నెట్ రన్‌రేటును భారీగా మెరుగుపరుచుకుంది. వరల్డ్‌కప్-2024 ఎడిషన్ గ్రూప్-డిలో ఉన్న సౌతాఫ్రికా తర్వాత.. సూపర్-8కు చేరిన రెండో జట్టుగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment