T20 World Cup 2022- Team India: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో టీమిండియా విజయావకాశాలపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందని.. ఇలాంటి జట్టుతో ట్రోఫీ గెలవడం కష్టమేనని పేర్కొన్నాడు.
స్వదేశంలో ఆస్ట్రేలియాతో మొదటి టీ20లో 208 పరుగుల భారీ స్కోరు చేసి కూడా మ్యాచ్ కాపాడుకోలేకపోయారని విమర్శించిన ఆకాశ్ చోప్రా.. టీమిండియా బౌలర్ల ఆట తీరు ఇలాగే ఉంటే మెగా టోర్నీలో ముందుకు వెళ్లడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. కాగా అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.
చెత్త ఫీల్డింగ్, బౌలింగ్!
ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు స్వదేశంలో ఆసీస్, దక్షిణాఫ్రికాతో టీమిండియా వరుస సిరీస్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా కంగారూలతో తొలి టీ20లో 208 పరుగులు చేసిన టీమిండియా.. చెత్త ఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం కారణంగా 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
అదే విధంగా.. ఆసియా కప్-2022లో సూపర్-4 దశలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సైతం టీమిండియా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన రోహిత్ సేన.. ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఆ తర్వాత శ్రీలంకతో మ్యాచ్‌లోనూ ఓడి ఫైనల్ కూడా చేరకుండానే నిష్క్రమించింది ఈ డిఫెండింగ్ చాంపియన్. కాగా గాయం కారణంగా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, మరో ఫాస్ట్‌బౌలర్ హర్షల్ పటేల్ ఈ టోర్నీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
వీళ్లతో ట్రోఫీ గెలవడం కష్టమే
ఈ పరిణామాల నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ బౌలర్ల వైఫల్యాన్ని ఎత్తి చూపాడు. ముఖ్యంగా యజువేంద్ర చహల్ ఆట తీరుపై పెదవి విరిచాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... ‘‘నా అభిప్రాయం ప్రకారం.. టీమిండియా బౌలింగ్ విభాగం బలహీనంగా ఉంది.
వికెట్లు తీసే బౌలర్ ఒక్కరూ కనబడటం లేదు. లెగ్ స్పిన్నర్ యుజీ చహల్ ఫాస్ట్‌గా బౌలింగ్ చేస్తున్నాడు. ఆసియా కప్‌లోనూ ఇలాగే ఆడాడు. స్లోవర్ బాల్స్ వేయకుండా అతడు వికెట్లు ఎలా తీస్తాడు?
ఇక ఇప్పుడేమో హర్షల్, బుమ్రా జట్టులోకి తిరిగి వచ్చారని.. అంతా బాగుంటుందని సంబరపడిపోతున్నారు. కానీ నాకెందుకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. బాధగా అనిపించినా ఇదే నిజం.
ఐపీఎల్‌లో బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఈసారి మరీ అంత గొప్పగా ఏమీ ఆడలేదు. ఒక్క మ్యాచ్‌లో ఐదు లేదంటే ఆరు వికెట్లు తీసి మిగతా మ్యాచ్‌లలో చేతులు ఎత్తేయడం సరికాదు కదా! మన బౌలింగ్ బలహీనంగా ఉందనేది వాస్తవం. ఇలాంటి ఆట తీరుతో మనం ట్రోఫీ ఎలా గెలవగలం? రోజురోజుకీ మన విజయావకాశాలు సన్నగిల్లుతున్నాయి’’ అని పేర్కొన్నాడు.
చదవండి: భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్ కాదు.. టీ20 ప్రపంచకప్ విజేత ఆ జట్టే: భారత మాజీ ఆటగాడు
Comments
Please login to add a commentAdd a comment