
టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ రన్నరప్‌గానే మిగిలిపోయింది. పాక్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లండ్ రెండోసారి పొట్టి ఫార్మాట్‌లో చాంపియన్‌గా అవతరించింది. బెన్ స్టోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు తోడుగా జట్టు సమిష్టి ప్రదర్శన ఇంగ్లండ్‌కు విజయాన్ని కట్టబెట్టింది. డెత్ ఓవర్లలో బ్యాటర్లు బోల్తా పడడం.. పాక్ ఓటమికి కారణ మని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.
''16 ఓవర్లలో 119/4తో ఉన్న పాక్.. చివరి 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే చేసింది. వాస్తవంగా అయితే అక్కడినుంచి ఓవర్ కు 10 పరుగులు రాబట్టినా స్కోరు దాదాపుగా 160-165 పరుగులకు చేరుకొనేది. ఈ పిచ్‌పై ఇది నిజంగా సవాల్ విసిరే స్కోరు. కానీ, ఎంసీజీ గ్రౌండ్ బౌండరీలను పాక్ బ్యాటర్లు సరిగా అర్థం చేసుకోలేదు. ఈ కిటుకును పసిగట్టకపోవడం వల్లే డెత్ ఓవర్లలో వారు తడబడ్డారు.
ఇంగ్లండ్ బౌలర్లు కూడా తెలివిగా బౌండ్రీ 85 మీటర్ల దూరం ఉన్న వైపే షాట్లు ఆడే విధంగా బంతులు విసిరి.. పాక్ బ్యాటర్లను ఉచ్చులోకి లాగారు. కొంచెం బుర్ర ఉపయోగించి సింగిల్స్, డబుల్స్‌తో నెట్టుకొచ్చినా పరిస్థితి మరో రకంగా ఉండేది.ఇదే పాక్ ఓటమికి ప్రధాన కారణం.'' అని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు.