T20 World Cup 2021: విండీస్‌ విలవిల.. చెత్త రికార్డు | T20 World Cup 2021: England Beat West Indies By 6 Wickets | Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: విండీస్‌ విలవిల.. చెత్త రికార్డు

Published Sun, Oct 24 2021 9:33 AM | Last Updated on Sun, Oct 24 2021 1:25 PM

T20 World Cup 2021: England Beat West Indies By 6 Wickets - Sakshi

T20 World Cup 2021: ఐదేళ్ల క్రితం 2016 టి20 ప్రపంచకప్‌ అంటే ఠక్కున గుర్తొచ్చేది వెస్టిండీస్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌. టైటిల్‌ గెలిచేందుకు చివరి ఓవర్లో వెస్టిండీస్‌ 19 పరుగులు చేయాల్సి ఉండగా... బ్రాత్‌వైట్‌ నాలుగు వరుస సిక్సర్ల విన్యాసం ప్రతి క్రికెట్‌ అభిమానికి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఐదేళ్లు గడిచాయి. ఆ ఫైనల్‌కు కొనసాగింపు అన్నట్లు ప్రస్తుత టి20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు మరోసారి తలపడ్డాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో అడుగుపెట్టిన వెస్టిండీస్‌ ఈసారి పూర్తిగా తడబడింది. చెత్త ఆటతీరుతో 55 పరుగులకే ఆలౌటై ఇంగ్లండ్‌ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. 

దుబాయ్‌: ప్రపంచవ్యాప్తంగా జరిగే టి20 లీగ్‌ల్లో ఆడే ప్రముఖ ఆటగాళ్లు... ఎనిమిదో వరుస ఆటగాడి వరకు ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా... పొట్టి ఫార్మాట్‌లో విధ్వంసకర జట్టుగా పేరు... అయితేనేం టి20 ప్రపంచకప్‌లోని తమ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌ బోల్తా పడింది. గ్రూప్‌–1లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆరు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 14.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది.

టి20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్‌కిదే అత్యల్ప స్కోరు కాగా... ఓవరాల్‌గా రెండోది. 2019లో ఇంగ్లండ్‌పైనే చేసిన 45 పరుగుల తొలి స్థానంలో ఉంది. ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ (4/2)తో తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. క్రిస్‌ గేల్‌ (13 బంతుల్లో 13; 3 ఫోర్లు) మాత్రమే విండీస్‌ జట్టులో రెండంకెల స్కోరును సాధించాడు. ఛేజింగ్‌లో ఇంగ్లండ్‌ 8.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టపోయి 56 పరుగులు చేసి గెలుపొందింది. జోస్‌ బట్లర్‌ (22 బంతుల్లో 24 నాటౌట్‌; 3 ఫోర్లు) లాంఛనం పూర్తి చేశాడు.  

రషీద్‌ మ్యాజిక్‌ 
ఇంగ్లండ్‌ లెగ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ మ్యాజిక్‌ స్పెల్‌తో వెస్టిండీస్‌ పని పట్టాడు. కేవలం 2.2 ఓవర్లు (14 బంతులు) వేసిన అతడు రెండు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇందులో విధ్వంసకర కీరన్‌ పొలార్డ్‌ (6), ఆండ్రీ రసెల్‌ (0)లతో పాటు మెకాయ్‌ (0), రవి రాంపాల్‌ (3) వికెట్లు ఉన్నాయి. రషీద్‌కు మొయిన్‌ అలీ (2/17), టైమల్‌ మిల్స్‌ (2/17) సహకరించడంతో వెస్టిండీస్‌ కోలుకోలేకపోయింది. జట్టులో గేల్‌ మాత్రమే రెండంకెల స్కోరు చేయగా... మిగిలిన పది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితయ్యారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను అకీల్‌ తన బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టాడు. అయితే లక్ష్యం మరీ చిన్నదిగా ఉండటం... బట్లర్‌ నిలవడంతో ఛేదనలో ఇంగ్లండ్‌ కాస్త తడబడినా విజయాన్ని అందుకుంది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టిన మొయిన్‌ అలీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. 
స్కోరు వివరాలు

స్కోర్లు:
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: సిమన్స్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) మొయిన్‌ అలీ 3; ఎవిన్‌ లూయిస్‌ (సి) మొయిన్‌ అలీ (బి) వోక్స్‌ 6; గేల్‌ (సి) మలాన్‌ (బి) మిల్స్‌ 13; హెట్‌మైర్‌  (సి) మోర్గాన్‌ (బి) మొయిన్‌ అలీ 9; బ్రావో (సి) బెయిర్‌స్టో (బి) జోర్డాన్‌ 5; పూరన్‌ (సి) బట్లర్‌ (బి) మిల్స్‌ 1; పొలార్డ్‌ (సి) బెయిర్‌స్టో (బి) ఆదిల్‌ రషీద్‌ 6; రసెల్‌ (బి) ఆదిల్‌ రషీద్‌ 0; అకీల్‌ హోసీన్‌ (నాటౌట్‌) 6; మెకాయ్‌ (సి) రాయ్‌ (బి) ఆదిల్‌ రషీద్‌ 0; రవి రాంపాల్‌ (బి) ఆదిల్‌ రషీద్‌ 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (14.2 ఓవర్లలో ఆలౌట్‌) 55. వికెట్ల పతనం: 1–8, 2–9, 3–27, 4–31, 5–37, 6–42, 7–44, 8–49, 9–49, 10–55. బౌలింగ్‌: మొయిన్‌ అలీ 4–1–17–2, వోక్స్‌ 2–0–12–1, మిల్స్‌  4–0–17–2, జోర్డాన్‌ 2–0–7–1, ఆదిల్‌ రషీద్‌ 2.2–0–2–4.  

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (సి) గేల్‌ (బి) రవి రాంపాల్‌ 11; బట్లర్‌ (నాటౌట్‌) 24; బెయిర్‌స్టో (సి అండ్‌ బి) అకీల్‌ 9; మొయిన్‌ అలీ (రనౌట్‌) 3; లివింగ్‌స్టోన్‌ (సి అండ్‌ బి) అకీల్‌ 1; మోర్గాన్‌ (నాటౌట్‌) 7, ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (8.2 ఓవర్లలో 4 వికెట్లకు) 56. వికెట్ల పతనం: 1–21, 2–30, 3–36, 4–39. బౌలింగ్‌: అకీల్‌ 4–0–24–2, రవి రాంపాల్‌ 2–0–14–1, మెకాయ్‌ 2–0–12–0, పొలార్డ్‌ 0.2–0–6–0.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement