
ఐదు వన్డే వరల్డ్‌కప్‌లు గెలిచినా కూడా... ఆరు ప్రయత్నాల్లోనూ టి20 ప్రపంచకప్‌లో చాంపియన్ కాలేకపోయిన జట్టు ఒకవైపు... రెండు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలోనూ ఒక్కసారి కూడా విశ్వ విజేత హోదాలో నిలవలేకపోయిన టీమ్ మరోవైపు... ఒకరిది పాత వైభవం నిలబెట్టుకునే ప్రయత్నం... మరొకరికి కొత్త చరిత్ర సృష్టించే అవకాశం... 44 ఆసక్తికర సమరాల తర్వాత టి20 ప్రపంచకప్‌లో ఆఖరి ఘట్టానికి రంగం సిద్ధమైంది.
తొలిసారి టి20ల్లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచేందుకు అటు ఆస్ట్రేలియా, ఇటు న్యూజిలాండ్ ‘సై’ అంటున్నాయి. బలమైన బ్యాటింగ్‌ను నమ్ముకున్న కంగారూ టీమ్... వైవిధ్యమైన బౌలింగ్‌తో సత్తా చాటిన న్యూజిలాండ్ మధ్య నేడు జరిగే ఫైనల్ పోరులో పైచేయి సాధించి ‘తొలి టైటిల్’ ఎవరు సాధిస్తారనేది ఆసక్తికరం.
T20 World Cup 2021 Final Aus Vs NZ: ‘ట్రాన్స్ టాస్మన్ ’ దేశాల మధ్య మరోసారి అతి పెద్ద క్రీడా సమరానికి సమయం వచ్చేసింది. నేడు జరిగే టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. లీగ్ దశలో ఇరు జట్లు చెరో నాలుగు విజయాలు, దాదాపు ఒకే తరహా రన్‌రేట్‌తో ముందంజ వేశాయి. ఆపై టోర్నీ ఫేవరెట్‌లు ఇంగ్లండ్, పాకిస్తాన్‌లను ఓడించి తుది పోరుకు అర్హత సాధించాయి. ప్రపంచకప్ ఫైనల్ వరకు చూస్తే 2015 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఇరు జట్లు చివరిసారిగా తలపడగా, ఆసీస్ ఏకపక్ష విజయం సాధించింది. అయితే ఈసారి హోరాహోరీ సమరానికి అవకాశం ఉంది.
మార్పుల్లేకుండా...
పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా సాధించిన గెలుపును బట్టి చూస్తే టీమ్‌లో ఎలాంటి మార్పులకు అవకాశం లేదు. ఐపీఎల్‌లో వైఫల్యం, అవమానకర నిష్క్రమణ తర్వాత ప్రపంచకప్‌లో కీలక సమయాల్లో వార్నర్ చెలరేగిన తీరు అతని స్థాయిని చూపించింది. మరోసారి అతను ఇదే జోరు సాగిస్తే కివీస్‌కు కష్టాలు తప్పవు. అయితే కెప్టెన్ ఫించ్ ఫామ్ మాత్రమే కాస్త ఆందోళనకరంగా ఉంది. ఇప్పటి వరకు టోర్నీలో 119 పరుగులే చేసిన ఫించ్ కనీసం ఫైనల్లోనైనా చెలరేగాల్సి ఉంది. మిచెల్ మార్‡్ష, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్‌లతోపాటు గత మ్యాచ్ హీరో మాథ్యూ వేడ్‌తో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. స్టీవ్ స్మిత్ అద్భుతాలు చేయకపోయినా... ఈ టీమ్‌లో అతని పాత్ర ఎంతో కీలకం.
ముగ్గురు పేసర్లు కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్ ప్రధాన పాత్ర పోషించాల్సి ఉండగా... స్పిన్నర్ ఆడమ్ జంపా ఇప్పటికే టోర్నీలో తనదైన ముద్ర వేశాడు. ప్రతీ మ్యాచ్‌లో ప్రత్యర్థుల ఆట కట్టించిన అతను ఆరు మ్యాచ్‌లలో ఐదుసార్లు గరిష్టంగా 22 పరుగులే ఇచ్చాడు. ఆల్‌రౌండర్ మిచెల్ మార్‡్ష రెండు రంగాల్లోనూ ఆకట్టుకోగా, మ్యాక్స్‌వెల్‌తో కలిసి ఐదో బౌలర్ కోటా కూడా పూర్తి చేసే అవకాశం ఉండటం ఆసీస్‌కు సానుకూలాంశం. ప్రత్యర్థిపై గత రికార్డు, నాకౌట్ మ్యాచ్‌లలో చెలరేగే తత్వం కలిసిన ఆసీస్ తమ స్థాయికి తగినట్లుగా ఆడితే టైటిల్ గెలిచేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి.
సీఫెర్ట్‌కు చోటు...
ఇంగ్లండ్‌పై అద్భుత విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్ అదే స్ఫూర్తిని మరో మ్యాచ్‌లోనూ ప్రదర్శించాల్సి ఉంది. డరైల్ మిచెల్, గప్టిల్ శుభారంభం అందిస్తే తర్వాతి బ్యాట్స్‌మెన్ దానిని కొనసాగించగలరు. దూకుడుగా ఆడగల కాన్వే గాయంతో ఫైనల్‌కు దూరం కావడం జట్టుకు పెద్ద దెబ్బ. అతని స్థానంలో టిమ్ సీఫెర్ట్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అయితే కాన్వేతో పోలిస్తే బ్యాటింగ్‌లో సీఫెర్ట్ కాస్త బలహీనం. మరోవైపు ఆసీస్ సారథి ఫించ్ తరహాలో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ కూడా పేలవ బ్యాటింగ్‌ను ప్రదర్శిస్తున్నాడు.
టోర్నీలో అతను 131 పరుగులే చేశాడు. ధాటిగా ఆడగలడని భావించిన ఫిలిప్స్ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయితే ఆరో స్థానంలో నీషమ్ రూపంలో సరైన వ్యక్తి ఉండటం కివీస్ బలం. అతని బ్యాటింగ్ పదునేమిటో సెమీస్‌లో కనిపించింది. బౌలింగ్‌లోనూ నీషమ్ రాణిస్తే 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ చేదు జ్ఞాపకాలను చెరిపేయగలడు! టోర్నీలో కివీస్‌ను ఫైనల్ వరకు చేర్చడంలో బౌలర్లదే కీలక పాత్ర. పేస్ బౌలర్ బౌల్ట్ ఎప్పటిలాగే సత్తా చాటగా, టిమ్ సౌతీ కూడా టోర్నీలో ఆరుకంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేయడం విశేషం. ఆసీస్‌తో పోలిస్తే ఇద్దరు రెగ్యులర్ స్పిన్నర్లు ఇష్ సోధి, సాన్‌ట్నర్ మరింత ప్రభావం చూపించగలరు. జూన్ నెలలో వరల్డ్ టెస్టు చాంపియన్‌గా నిలిచిన న్యూజిలాండ్... ఇక్కడా గెలిస్తే అది అరుదైన ఘనత అవుతుంది.
తుది జట్లు (అంచనా)
ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), వార్నర్, మార్ష్, స్మిత్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, వేడ్, కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్, జంపా
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మిచెల్, ఫిలిప్స్, సీఫెర్ట్, నీషమ్, సాన్‌ట్నర్, మిల్నే, సౌతీ, సోధి, బౌల్ట్
చదవండి: Matthew Wade: క్యాన్సర్ బారిన పడ్డ మాథ్యూ వేడ్.. ప్లంబర్‌గా, కార్పెంటర్‌గా.. చివరకు...