
విజేతకు బదులు రన్నరప్‌కు అభినందనలు తెలిపిన టీమిండియా వెటరన్ ప్లేయర్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
T20 WC 2021 Winner Australia: Amit Mishra Getting Trolled Why Deletes Tweet: టీమిండియా వెటరన్ ప్లేయర్ అమిత్ మిశ్రాను నెటిజన్లు ఆడుకుంటున్నారు. ‘‘అయ్యో.. ఇదేంటి అమిత్ మ్యాచ్ చూడలేదా ఏంటి?’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. నవంబరు 14న దుబాయ్ వేదికగా టీ20 ప్రపంచకప్-2021 ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా కొత్త చాంపియన్‌గా అవతరించింది. ఇన్నాళ్లు ఊరిస్తున్న పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుని చిరకాల కోరిక నెరవేర్చుకుంది.
ఈ నేపథ్యంలో ఆరోన్ ఫించ్ బృందానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టీమిండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సైతం... విజేతను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. అయితే, అక్కడే అమిత్ పప్పులో కాలేశాడు. ‘‘వరల్డ్‌కప్ గెలిచిన బ్లాక్‌కాప్స్‌కు శుభాకాంక్షలు. సమష్టి విజయం. చాలా బాగా ఆడారు’’ అని ట్వీటాడు. విన్నర్ ఆసీస్‌కు బదులు న్యూజిలాండ్‌కు విషెస్ చెప్పాడు.
ఇంకేం ఉంది.. అమిత్ మిశ్రా ‘తప్పిదాన్ని’ గుర్తించిన నెటిజన్లు ఫన్నీగా అతడిని ట్రోల్ చేస్తున్నారు. దీంతో.. అమిత్ మిశ్రా తన ట్వీట్‌ను డెలిట్ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ క్రికెట్ హాండిల్ స్థానంలో ఆసీస్‌ను రీప్లేస్ చేసి అభినందనలు తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న మిచెల్ మార్ష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు.
స్కోర్లు:
న్యూజిలాండ్- 172/4 (20)
ఆస్ట్రేలియా- 173/2 (18.5)