మాథ్యూ హేడెన్.. జస్టిన్ లాంగర్.. వీరిద్దరు ఒకప్పుడు ఆసీస్‌కు ఓపెనింగ్ జోడీ. 2000 దశకంలో వీరు ఆసీస్ క్రికెట్‌ను ఒక ఊపు ఊపేశారు. ప్రధానంగా టెస్టుల్లో ఈ జోడీ అత్యంత భయంకరమైన జోడీగా గుర్తింపు పొందింది. టెస్టుల్లో ఆసీస్‌కు అత్యుత్తమ ఓపెనింగ్ ద్వయంగా నిలిచింది. టెస్టు క్రికెట్‌లో ఈ జోడి ఆసీస్ తరఫున నాల్గో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను నమోదు చేయడం వారు సక్సెస్‌ఫుల్ జోడీగా చెప్పడానికి ఒక ఉదాహరణ. 2004లో శ్రీలంకపై చేసిన 255 పరుగుల వీరి తొలి వికెట్ అత్యుత్తమ భాగస్వామ్యం.
ఇదిలా ఉంచితే, వీరిద్దరూ ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడ్డారు. కానీ ముఖాముఖి పోరులో కాదు.. కోచ్‌లుగా అమీతుమీ తేల్చకున్నారు. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా మాథ్యూ హేడెన్ పాకిస్తాన్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తుంటే, ఆసీస్‌కు జస్టిన్ లాంగర్ కోచ్‌గా ఉన్నాడు. కాగా, గురువారం జరిగిన సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌పై ఆసీస్ విజయం సాధించడంతో లాంగర్‌దే పైచేయి అయ్యింది.
పాకిస్తాన్‌పై ఆసీస్ విజయం సాధించడంతో ఫైనల్లోకి ప్రవేశించింది. 2010 తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా ఈ పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్‌లో ఆసీస్ రెండుసార్లు మాత్రమే తుది పోరుకు అర్హత సాధించింది. మరొకవైపు ఈ వరల్డ్‌కప్‌లో బ్యాటింగ్‌లో పాకిస్తాన్ రాణించడంతో హేడెన్ హీరో అయ్యాడు. తొలి మ్యాచ్ మొదలుకొని చూస్తే పాకిస్తాన్ బ్యాటింగ్ పదును పెరిగింది. ఇది గత పాకిస్తాన్ క్రికెట్ జట్టేనే అన్నట్లుగా మెరిసింది.
ఇందుకు హేడెన్ ప్రధాన కారణమనే చర్చ తెరపైకి వచ్చింది. హేడెన్ బ్యాటింగ్ వ్యూహాలతోనే పాకిస్తాన్ అద్బుతమైన ఫలితాలు సాధించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 12 జట్లు తలపడే టీ 20వరల్డ్‌కప్‌లో పాక్ జట్టు సెమీస్‌కు చేరుతుందనే అంచనాలు పెద్దగా లేవు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఘోరమైన ప్రదర్శన కారణంతో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడమే ఆ జట్టుపై పెద్దగా అంచనాలు లేకపోవడానికి కారణం. కానీ అంచనాలను తలక్రిందులు చేస్తూ పాకిస్తాన్ సెమీస్‌కు రావడమే కాకుండా, బెస్ట్ ఆఫ్ ఫోర్‌లో గట్టిపోటీ ఇచ్చింది. ఈ వరల్డ్‌కప్ సెమీ ఫైనల్లో తొలుత ఆ జట్టు బ్యాటింగ్ చేసిన తీరు పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుతుందని అంతా అనుకున్నారు. బోర్డుపై 177 పరుగుల టార్గెట్‌ను ఉంచడంతో పాకిస్తాన్ విజయం సాధిస్తుందని సగటు అభిమాని భావించాడు. కానీ మాథ్యూ వేడ్, స్టోయినిస్‌ల మెరుపు ఇన్నింగ్స్‌లు ఆసీస్‌ను గెలిపించాయి.
ఒకవేళ నిన్నటి మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుచుంటే ఆ క్రెడిట్ కచ్చితంగా హేడెన్ ఖాతాలోకి వెళ్లేది. కానీ ఆసీస్ ఫైనల్‌కు చేరడంతో మిత్రడు హేడెన్‌పై లాంగర్‌దే ఆధిక్యమైంది. దీంతో ‘ఎవరు గెలిస్తే ఏముంది’.. గెలిచింది మన జట్టే కదా.. మనోడే కదా అని హేడెన్ సర్దిచెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment