నమీబియా ఆటగాడు డేవిడ్ వీస్ సెలబ్రేషన్... శ్రీలంక ఆటగాళ్ల సంబరం
T20 World Cup 2021: టి20 ప్రపంచకప్‌లో తొలిసారి ఆడుతున్న క్రికెట్ పసికూన నమీబియా సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకుంది. సూపర్–12 దశకు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తన కంటే బలమైన ఐర్లాండ్‌ను మట్టికరిపించి మెగా టోర్నీలో ముందడుగు వేసింది. క్వాలిఫయింగ్ రౌండ్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో నమీబియా 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించి తమ క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ (24 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్), కెవిన్ ఒబ్రెయిన్ (24 బంతుల్లో 25; 2 ఫోర్లు,) ఫర్వాలేదనిపించారు. జాన్ ఫ్రైలింక్ (3/21), డేవిడ్ వీస్ (2/22) ఐర్లాండ్‌ను కట్టడి చేయడంలో తమవంతు పాత్రను నిర్వర్తించారు.
ఛేదనలో నమీబియా 18.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 126 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ గెరాడ్ ఎరాస్మస్ (49 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వీస్ (14 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్‌లు) జట్టుకు విజయాన్ని అందించారు. వీస్, ఎరాస్మస్ అజేయమైన మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించారు.
హ్యాట్రిక్ కొట్టిన శ్రీలంక
ఇప్పటికే టి20 ప్రపంచ కప్‌లో సూపర్–12కు చేరిన శ్రీలంక హ్యాట్రిక్ విజయాలతో క్వాలిఫయింగ్ రౌండ్‌ను ఘనంగా ముగించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఎనిమిది వికెట్లతో నెదర్లాండ్స్‌పై నెగ్గింది. తొలుత నెదర్లాండ్స్ 10 ఓవర్లలో 44 పరుగులకే కుప్పకూలింది.
శ్రీలంక బౌలర్లు లహిరు కుమార (3/7), హసరంగ (3/9) ధాటికి నెదర్లాండ్స్ బ్యాటర్స్‌లో పది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అకర్‌మాన్ (11 బంతుల్లో 11; 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్. ఛేదనలో శ్రీలంక 7.1 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 45 పరుగులు చేసి నెగ్గింది. కుశాల్ పెరీరా (24 బంతుల్లో 33 నాటౌట్; 6 ఫోర్లు) రాణించాడు. లహిరు కుమారకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
సూపర్-12కు అర్హత సాధించిన జట్లు ఇవే
అక్టోబరు 23 నుంచి మొదలుకానున్న సూపర్-12 రౌండ్‌కు.. గ్రూపు- ఏ, గ్రూపు- బి నుంచి టాప్-2 స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు అర్హత సాధించాయి. గ్రూపు- ఏ నుంచి శ్రీలంక, నమీబియా... గ్రూపు- బి నుంచి బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ప్రధాన పోటీకి సిద్ధమయ్యాయి.
చదవండి: T20 World Cup 2021: ఆసీస్ ఏం చేస్తుందో... దక్షిణాఫ్రికాకు అదే సానుకూలాంశం..
Comments
Please login to add a commentAdd a comment