PAK vs AUS: స్టోయినిస్‌, వేడ్‌ మెరుపులు.. ఫైనల్‌కు ఆస్ట్రేలియా | T20 World Cup 2021: PAK vs AUS Semi-Final 2 Updates And Highlights | Sakshi
Sakshi News home page

T20 WC 2021 PAK vs AUS Semi Final 2:స్టోయినిస్‌, వేడ్‌ మెరుపులు.. ఫైనల్‌కు ఆస్ట్రేలియా; పాకిస్తాన్‌ ఓటమి

Published Thu, Nov 11 2021 7:01 PM | Last Updated on Thu, Nov 11 2021 11:28 PM

T20 World Cup 2021: PAK vs AUS Semi-Final 2 Updates And Highlights - Sakshi

స్టోయినిస్‌, వేడ్‌ మెరుపులు.. ఫైనల్‌కు ఆస్ట్రేలియా; పాకిస్తాన్‌ ఓటమి
సమయం:23:19.. టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు ప్రవేశించింది. పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఆస్ట్రేలియా ఒక దశలో 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తున్నట్లు కనిపించింది. కానీ మార్కస్‌ స్టోయినిస్(‌31 బంతుల్లో 40 పరుగులు; 2 ఫోర్లు, 2 సిక్సర్లు ), మాథ్యూ వేడ్‌(17 బంతుల్లో 41 పరుగులు, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) పోటాపోటీగా సిక్సర్లు, బౌండరీలు వర్షం కురిపించడంతో ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. అంతకముందు డేవిడ్‌ వార్నర్‌ 49 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌తో ఆడాడు. పాకిస్తాన్‌ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ 4 వికెట్లు తీశాడు. ఇక నవంబర్‌ 14 న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

ఇక 2015 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. అంతకముందు పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.  ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(67 పరుగులు) మరో అర్థశతకంతో మెరవగా.. ఫఖర్‌ జమాన్‌ (32 బంతుల్లో 55 పరుగులు;  3 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ 39 పరుగులు చేశాడు. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 2, కమిన్స్‌, జంపా చెరో వికెట్‌ తీశారు

సమయం: 23:04.. పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ హోరాహోరిగా సాగుతుంది. ప్రస్తుతం 18 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. స్టోయినిస్‌ 40, వేడ్‌ 21 పరుగులతో ఆడుతున్నారు.

13 ఓవర్లలో ఆస్ట్రేలియా 103/5
సమయం: 22:34.. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వార్నర్‌ ఔటైన కాసేపటికే మ్యాక్స్‌వెల్‌(7)ను షాబాద్‌ బోల్తా కొట్టించాడు. షాబాద్‌కు ఇది నాలుగో వికెట్‌ కావడం విశేషం. ప్రస్తుతం 13 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది.

సమయం: 22:25..  డేవిడ్‌ వార్నర్‌(49) రూపంలో ఆస్ట్రేలియా బిగ్‌ వికెట్‌ కోల్పోయింది. పాక్‌ స్పిన్నర్‌ షాదబ్‌ ఖాన్‌ 3 వికెట్లతో ఆసీస్‌ను దెబ్బ తీశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 11 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.

స్మిత్‌ (5) ఔట్‌.. మూడో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
సమయం: 22:17..
ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. షాదాబ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో స్టీవ్‌ స్మిత్‌(5) క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. వార్నర్‌ 48, మ్యాక్స్‌వెల్‌ 3 పరుగలుతో ఆడుతున్నారు. 

సమయం: 22:00.. నిలకడగా ఆడుతున్న ఆస్ట్రేలియా మిచెల్‌ మార్ష్‌(28) రూపంలో రెండో వికెట్‌ కోల్పోయింది. వార్నర్‌ 24, స్మిత్‌ 0 పరుగులతో ఆడుతున్నారు.

5 ఓవర్లలో ఆస్ట్రేలియా 44/1
సమయం: 21:53.. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 44 పరుగులు చేసింది. వార్నర్‌ 22, మార్ష్‌ 22 పరుగులతో ఆడుతున్నారు.ఫించ్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగినప్పటికీ తర్వాత వచ్చిన మార్ష్‌తో కలిసి వార్నర్‌ ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. 

ఆరోన్‌ ఫించ్‌ గోల్డెన్‌ డక్‌
సమయం: 21:36..
177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. షాహిన్‌ అఫ్రిది బౌలింగ్‌లో ఆరోన్‌ ఫించ్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 6 పరుగులు చేసింది. వార్నర్‌ 3, మిచెల్‌ మార్ష్‌ 3 పరుగులతో ఆడుతున్నారు.

ఫఖర్‌ జమాన్‌ మెరుపులు.. పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 176/4
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.  ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(67 పరుగులు) మరో అర్థశతకంతో మెరవగా.. ఫఖర్‌ జమాన్‌ (32 బంతుల్లో 55 పరుగులు;  3 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ 39 పరుగులు చేశాడు. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 2, కమిన్స్‌, జంపా చెరో వికెట్‌ తీశారు.

రిజ్వాన్‌(67) ఔట్‌.. మూడో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌
ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(67) రూపంలో పాకిస్తాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. స్టార్క్‌ బౌలింగ్‌లో మిడాఫ్‌ దిశగా షాట్‌ ఆడినప్పటికీ స్మిత్‌ క్యాచ్‌ తీసుకున్నాడు. ప్రస్తుతం 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఫఖర్‌ జమాన్‌ 40, ఆసిఫ్‌ అలీ 0 పరుగులతో ఆడుతున్నాడు.

10 ఓవర్లలో పాకిస్తాన్‌ 71/1
సమయం: 20:12.. పాకిస్తాన్‌ ఓపెనర్‌ బాబర్‌ అజమ్‌(39) రూపంలో పాకిస్తాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన బాబర్‌ వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 71 పరుగులు చేసింది. మహ్మద్‌ రిజ్వాన్‌ 28 పరుగులతో ఆడుతున్నాడు.

ధాటిగా ఆడుతున్న పాకిస్తాన్‌.. 5 ఓవర్లలో 38/0
సమయం: 19:50.. ఆ‍స్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలుపెట్టింది. 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. బాబర్‌ అజమ్‌ 21, మహ్మద్‌ రిజ్వాన్‌ 15 పరుగులతో ఆడుతున్నారు.

దుబాయ్‌: టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా గురువారం పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇక సూపర్‌ 12 దశలో పాకిస్తాన్‌ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి నాటౌట్‌గా సెమీస్‌లో అడుగుపెట్టింది. మరోవైపు ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి.. ఒకటి ఓడి సెమీస్‌లోకి ప్రవేశించింది. పాకిస్తాన్ జట్టులో ఉన్న 11 మంది సూపర్‌ ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు సానుకూలాంశం. ఒకరు విఫలమైతే.. మరొకరు ఆడుతుండడం పాక్‌కు అదనపు బలం. బౌలింగ్‌లో షాహిన్‌ అఫ్రిది, హారిస్‌ రౌఫ్‌, హసన్‌ అలీలు అంచనాలకు మించి రాణిస్తున్నారు.

ఇక ఆస్ట్రేలియా మాత్రం బ్యాటింగ్‌లో డేవిడ్‌ వార్నర్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది. మిగిలిన బ్యాటర్స్‌లో మ్యాక్స్‌వెల్‌, స్మిత్‌, ఫించ్‌లు తమదైన ఆటతీరును ఇంకా చూపించలేదు. వీరు కూడా ఫామ్‌లోకి వస్తే పాకిస్తాన్‌కు కొంచెం కష్టమే. ఇక స్టార్క్‌, కమిన్స్‌, హాజిల్‌వుడ్‌, జంపా లాంటి బౌలర్లతో ఆసీస్‌ బౌలింగ్‌  పటిష్టంగానే కనిపిస్తుంది. ఓవరాల్‌గా పాకిస్తాన్‌ ఫెవరెట్‌గా కనిపిస్తున్నప్పటికి ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయలేము.

ఇక ముఖాముఖి పోరులో ఇరుజట్లు టి20ల్లో 22 సార్లు తలపడగా.. 13 సార్లు పాకిస్తాన్‌.. 9 సార్లు ఆసీస్‌ గెలిచింది. ఇక టి20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆరుసార్లు తలపడిన ఈ రెండు జట్లు చెరో మూడు విజయాలతో సమానంగా ఉన్నాయి. ఇంకో విశేషమేమిటంటే ఐసీసీ టోర్నీ నాకౌట్లలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇక యూఏఈలో పాకిస్తాన్‌ 16 టి20 మ్యాచ్‌లు ఆడగా.. 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించడం విశేషం.

పాకిస్థాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్‌ కీపర్‌), బాబర్ అజమ్‌(కెప్టెన్‌), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వాసిం, హసన్ అలీ, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(కెప్టెన్‌), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్(వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement