హసరంగ హ్యాట్రిక్ వృధా.. ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం
సమయం 7:05.. శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికానే విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో లంక నిర్ధేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాట ఆడింది. తొలుత లంక స్పిన్నర్ హసరంగ(3/20) హ్యాట్రిక్ సాధించడంతో మ్యాచ్ లంక వైపు మొగ్గుచూపగా.. ఆఖర్లో మిల్లర్(13 బంతుల్లో 23; 2 సిక్సర్లు) కిల్లర్ ఇన్నింగ్స్ ఆడడంతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దక్షిణాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా.. మిల్లర్ వరుస సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. అతనికి రబాడ(7 బంతుల్లో 13; ఫోర్, సిక్స్) సహకరించడంతో మరో బంతి మిగిలుండగానే దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారి కెప్టెన్ బవుమా(46 బంతుల్లో 46; ఫోర్, సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో హసరంగతో పాటు చమీరా(2/27) రాణించాడు.
హసరంగ హ్యాట్రిక్.. ఓటమి దిశగా దక్షిణాఫ్రికా
సమయం 18: 50.. లంక స్పిన్నర్ హసరంగ హ్యాట్రిక్ సాధించాడు. 15వ ఓవర్ ఆఖరి బంతికి మార్క్రమ్(20 బంతుల్లో 19; 2 ఫోర్లు)ను క్లీన్ బౌల్డ్ చేసిన లంక స్పిన్నర్.. 18వ ఓవర్ మొదటి బంతికి సఫారి కెప్టెన్ బవుమా(46 బంతుల్లో 46; ఫోర్, సిక్స్)ను, రెండో బంతికి ప్రిటోరియస్(0)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో సఫారీ జట్టు స్కోర్ 17.2 ఓవర్ల తర్వాత 112/6గా మారింది. క్రీజ్‌లో మిల్లర్(3), రబాడ ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. మార్క్రమ్(19) ఔట్
సమయం 18: 34.. హసరంగ వేసిన 15వ ఓవర్ ఆఖరి బంతికి మార్క్రమ్(20 బంతుల్లో 19; 2 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా సఫారి జట్టు 96 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో బవుమా(34), మిల్లర్ ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. డస్సెన్(16) రనౌట్
సమయం 18: 00.. ఇన్నింగ్స్ 8వ ఓవర్ ఆఖరి బంతికి దక్షిణాఫ్రికా జట్టుకు మరో షాక్ తగిలింది. డేంజరస్ బ్యాటర్ వాన్ డర్ డస్సెన్(11 బంతుల్లో 16)ను షనక అద్భుతమైన త్రోతో రనౌట్ చేశాడు. ఫలితంగా సఫారి జట్టు 49 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో బవుమా(7), మార్క్రమ్ ఉన్నారు.
సఫారీలకు షాక్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన చమీరా
సమయం 17: 39.. 143 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. నాలుగో ఓవర్‌లో లంక పేసర్ చమీరా.. సఫారి ఓపెనర్లు హెండ్రిక్స్(11), డికాక్(12) వికెట్లను పడగొట్టాడు. ఫలితంగా సఫారి జట్టు 26 పరుగులకే 2 వికట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. క్రీజ్‌లో బవుమా, వాన్ డర్ డస్సెన్(1) ఉన్నారు.
సఫారి బౌలర్ల విజృంభణ ..142 పరుగులకే చాపచుట్టేసిన లంకేయులు
సమయం 17:10.. సఫారి బౌలర్లు ప్రిటోరియస్(3/17), షంషి(3/17), నోర్జే(2/27) విజృంభించడంతో లంక జట్టు నిర్ణీత ఓవర్లు ఆడి 142 పరుగులకే చాపచుట్టేసింది. లంక జట్టులో ఓపెనర్ పథుమ్ నిస్సంక(72), అసలంక(21), షనక(11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. నోర్జే వేసిన ఆఖరి ఓవర్ ఐదో బంతికి చమీరా(4 బంతుల్లో 3) క్లీన్ బౌల్డ్ కాగా, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి కుమార(0) రనౌట్ కావడంతో లంక ఇన్నింగ్స్‌కు తెరపడింది.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన ప్రిట్రోరియస్.. శ్రీలంక 131/8
సమయం 17:02.. ప్రిటోరియస్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో శ్రీలంక జట్టు 2 వికెట్లు కోల్పోయింది. 18.2వ ఓవర్లో కరుణరత్నే(5 బంతుల్లో 5)ను ఔట్ చేసిన ప్రిటోరియస్.. 18.4వ బంతికి నిస్సంక(56 బంతుల్లో 72;6 ఫోర్లు, 3 సిక్సర్లు)ను పెవిలియన్‌కు పంపాడు. 19 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 134/8. క్రీజ్‌లో మహీశ్ తీక్షణ, చమీరా ఉన్నారు.
ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. షనక(11) ఔట్
సమయం 16:52.. ప్రిటోరియస్ వేసన ఇన్నింగ్స్ 16.4వ ఓవర్లో రబాడకు క్యాచ్ ఇచ్చి షనక(12 బంతుల్లో 11; 2 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో ఆ జట్టు 110 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో నిస్సంక(56), కరుణరత్నే ఉన్నారు.
షంషి మాయాజాలం.. 91 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంక
సమయం 16:38..సఫారి స్పిన్నర్ తబ్రేజ్ షంషి.. తన స్పిన్ మాయాజాలంతో శ్రీలంక నడ్డి విరిచాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 17 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. షంషి వేసిన 13.4వ ఓవర్లో మార్క్రమ్ క్యాచ్ పట్టడంతో హసరంగ(5 బంతుల్లో 4) పెవిలియన్ బాట పట్టాడు. దీంతో శ్రీలంక 91 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. క్రీజ్‌లో నిస్సంక(45 బంతుల్లో 49), శనక ఉన్నారు.
షంషి ఉచ్చులో చిక్కిన ఫెర్నాండో(3).. శ్రీలంక నాలుగో వికెట్ డౌన్
సమయం 16:28.. లంక బ్యాటర్ అవిష్క ఫెర్నాండో(5 బంతుల్లో 3) తబ్రేజ్ షంషి ఉచ్చులో చిక్కుకున్నాడు. 11.4వ ఓవర్లో అవిష్క.. షంషి బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 79/4. క్రీజ్‌లో నిస్సంక(40), వినిందు హసరంగ ఉన్నారు.
లంకకు మరో షాక్.. రాజపక్స డకౌట్
సమయం 16:14.. పరుగు వ్యవధిలో లంక జట్టుకు మరో షాక్ తగిలింది. 61 పరుగుల వద్ద తొలుత అసలంక రనౌట్ కాగా.. 62 పరుగుల వద్ద షంషి బౌలింగ్‌లో రాజపక్స డకౌటయ్యాడు. దీంతో శ్రీలంక 9.3 ఓవర్ల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో పథుమ్ నిస్సంక(29), అవిష్క ఫెర్నాండో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. అసలంక(21) రనౌట్
సమయం 16:10.. రబాడ అద్బుతమైన త్రో కారణంగా శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 8.5వ ఓవర్లో రెండో పరుగుకు ప్రయత్నించి అసలంక(14 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్) రనౌటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 61/2. క్రీజ్‌లో పథుమ్ నిస్సంక(29 బంతుల్లో 28), భానుక రాజపక్స ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక.. కుశాల్ పెరీరా(7) ఔట్
సమయం 15:47.. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నాలుగో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది. 3.5వ ఓవర్లో నోర్జే బౌలింగ్‌లో కుశాల్ పెరీరా(10 బంతుల్లో 7; ఫోర్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 4 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 20/1. క్రీజ్‌లో పథుమ్ నిస్సంక(13 బంతుల్లో 12), చరిత్ అసలంక ఉన్నారు.
షార్జా: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా శనివారం(అక్టోబర్ 30) మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడగా.. చెరో మ్యాచ్‌లో గెలుపొందాయి. దక్షిణాఫ్రికా.. తొలి మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడినప్పటికీ.. మరుసటి మ్యాచ్‌లో పుంజుకుని విండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు శ్రీలంక తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచి.. మరుసటి మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.
పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 16 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా.. దక్షిణాఫ్రికా 11, శ్రీలంక 5 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ప్రపంచకప్ టోర్నీల్లో ఇరు జట్లు తలపడిన 3 సందర్భాల్లో సఫారీలదే( 2-1) పైచేయిగా ఉంది. ఇక ఇప్పటివరకు జరిగిన 6 టీ20 ప్రపంచకప్‌లలో(2007, 2009, 2010, 2012, 2014, 2016) శ్రీలంక ఘనమైన రికార్డే కలిగి ఉంది. ఆ జట్టు రెండుసార్లు(2009, 2012) ఫైనలిస్ట్‌గా, ఓ సారి ఛాంపియన్(2014)గా నిలిచింది. దక్షిణాఫ్రికా మాత్రం ఈ మెగా టోర్నీలో ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. 2009, 2014లో సెమీస్‌కు చేరడమే ఆ జట్టుకు అత్యుత్తమం.
తుది జట్లు:
దక్షిణాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్), డికాక్(వికెట్‌కీపర్), వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, డ్వేన్ ప్రిటోరియస్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా, అన్రిచ్ నోర్జే, తబ్రేజ్ షమ్సీ
శ్రీలంక: కుశాల్ పెరీరా(వికెట్‌కీపర్), పథుమ్ నిస్సంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, దసున్ శనక(కెప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, మహీశ్ తీక్షణ, లహీరు కుమార
Comments
Please login to add a commentAdd a comment